అప్పుడు బాలయ్య...ఇప్పుడు విజయ్ దేవరకొండ

SMTV Desk 2019-01-31 15:28:21  Nandamuri balakrishna, Vijay devarakonda, Nippuravva, Singareni Employ

హైదరాబాద్, జనవరి 31: యువ హీరో విజయ్ దేవరకొండ వరుస విజయాలతో దూసుకెళ్తూ ఉన్నాడు. ఈ మధ్య వచ్చిన టాక్షీవాలా పైరసీ అయినా కాని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే విజయ్ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే క్రాంతి మాధవ్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు విజయ్ దేవరకొండ. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కొత్తగూడెంలో జరుగుతోంది. ఈ సినిమా విజయ్ దేవరకొండ సింగరేణి కార్మికుడిగా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం వాటికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

దాదాపు 22 ఏళ్ల క్రితం బాలకృష్ణ నిప్పురవ్వ సినిమాలో సింగరేణి కార్మికుడి పాత్ర పోషించాడు. మళ్లీ ఇంతకాలానికి ఓ తెలుగు హీరో ఆ పాత్రలో కనిపించనున్నాడు. అప్పట్లో నిప్పురవ్వ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాను మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చే విధంగా రూపొందిస్తున్నారని సమాచారం. గతంలో క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వచ్చిన ఓనమాలు , మళ్లీ మళ్లీ ఇది రానిరోజు చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ లాంటి హీరోతో కొత్త ప్రయోగం చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన రాశిఖన్నా, ఐశ్వర్యరాజేష్ వంటి తారలు హీరోయిన్లుగా కనిపించనున్నారు.