వచ్చే మ్యాచుల్లో గెలిచి తీరుతాం

SMTV Desk 2019-04-03 13:21:19  Kohli, RCB

బెంగళూరు: ఈ ఐపిఎల్ సీజన్‌లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సిబి) జట్టు ఇంతవరకూ బోణీ కొట్టలేదు. వరుసగా నాలుగు మ్యాచుల్లో కోహ్లీసేన ఓటమి చవిచూసింది. దీంతో ఆర్‌సిబి అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్నారు. తాము బెంగళూరు అభిమానులమని చెప్పుకునే పరిస్థితి లేదని వారు సోషల్ మీడియా వేదికగా వాపోతున్నారు. విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్, హెట్మేయర్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉండి కూడా ఆర్‌సిబి అంచనాలను అందుకోలేకపోవడం అభిమానులను కలిచివేస్తోంది. ఈ సీజన్‌ టైటిల్ ఫేవరేట్ లలో ఒకటిగా బరిలోకి దిగిన బెంగళూరు జట్టు ఇలాంటి ప్రదర్శన చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇదిలాఉంటే తమ జట్టు ఘోర విఫలంపై తాజాగా కోహ్లీ స్పందించాడు. మంగళవారం నాటి రాజస్థాన్ మ్యాచ్ అనంతరం విరాట్ మీడియాతో మాట్లాడాడు.

ఆటలో గెలపు, ఓటములు సర్వసాధారణమేనని చెప్పిన కోహ్లీ ప్రారంభం బాగాలేనంత మాత్రాన నిరాశ పడాల్సిన అవసరం లేదన్నాడు. ఇప్పటివరకూ పాయింట్ల ఖాతాను తెరవలేకపోవడం కొంత నిరాశకు గురిచేసిన వచ్చే మ్యాచుల్లో గెలిచి తీరుతామని స్పష్టం చేశాడు. ముగిసిన నాలుగు మ్యాచుల్లో కొన్ని తప్పులు చేసినందుకే విజయం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని విరాట్ అభిప్రాయపడ్డాడు. తదుపరి తదుపరి మ్యాచ్ కి ముందు ఆటగాళ్లం అందరమూ కూర్చుని చర్చించుకుంటామని, మళ్లీ మునుపటి మ్యాచుల్లో జరిగిన పొరపాట్లు చేయబోమన్నాడు. తనలో పోరాట పటిమ ఇంకా మిగిలే ఉందని చెప్పిన కోహ్లీ… ఆర్‌సిబి ఆటగాళ్లపై పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు వివరించాడు. రాబోయే మ్యాచ్ లను గెలుస్తామన్న నమ్మకం ఉందన్నాడు. బెంగళూరు ఫ్యాన్స్ కూడా ఈ సందర్భంగా కోహ్లీ హామీ ఇచ్చాడు. తదుపరి మ్యాచుల్లో ఎట్టిపరిస్థితుల్లో గెలిచి చూపిస్తామని తెలిపాడు.