పవర్ స్టార్ అభిమానులకు శుభవార్త....!

SMTV Desk 2019-02-12 12:51:15  Pawan Kalyan, Andhra Pradesh Elections, Movies

హైదరాబాద్, ఫిబ్రవరి 12: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడం ఆయన అభిమానులకు శుభవార్తే అయినా, ఇక పై సినిమాలు చేయడనే విషయం మాత్రం అభిమానులను నిరాశ పరిచింది. పవన్ కళ్యాణ్ ను మళ్ళీ తెరపై చూడాలని అభిమానులు ఆశ పడుతున్నారు. అజ్ఞాతవాసి సినిమా తర్వాత ఆయన రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో పవన్ జనసేన పార్టీని బలపరిచే పనిలో ఉన్నారు. అయితే ఈ ఎన్నికల తర్వాత ఆయన మళ్ళీ సినిమాల్లోకి వస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ తనకి వచ్చే ఓట్ల శాతాన్ని బట్టి తదుపరి ఎన్నికలకు వ్యూహం రచిస్తాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికలని పవన్‌ ట్రయల్‌ గ్రౌండ్‌గానే తీసుకుంటున్నాడు తప్ప తప్పకుండా విజయం కోసం ఆరాట పడడం లేదనేది చాలా మంది అభిప్రాయం. ఆయన పనితీరు కూడా ఇందుకు తగ్గట్లే ఉంది. అయితే ఈ విషయంపై పవన్ కళ్యాణ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ ఇదే నిజమైతే ఈ ఎన్నికల తర్వాత పవన్ కి చాలా సమయం దొరుకుతుంది. ఈ సమయంలో సినిమాలు చేసే అవకాశం ఉందని సినిమా వర్గాల్లో టాక్ నడుస్తుంది. సినిమాల కోసం తనకి అడ్వాన్సులు చెల్లించిన నిర్మాతలకు పవన్ ఇంతవరకు వారి డబ్బులు తిరిగి ఇవ్వలేదు. దీన్ని బట్టి ఆయన మళ్ళీ సినిమాల్లోకి రావచ్చనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజం అనేది ఎన్నికల తర్వాతే తెలుస్తుంది.