కరెన్సీ కష్టాలు తీరుతాయి : కేంద్రం

SMTV Desk 2018-04-18 19:37:18  currency issues, central govt, rbi, mumbai

న్యూఢిల్లీ : నగదు కష్టాలు దేశాన్ని కుదిపేస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల పెద్దలతో సమావేశమైంది. దేశంలో తీవ్ర నగదు కొరత నెలకొని ఉండటం, నగదు లేక ఏటీఎంలు ఖాళీగా దర్శనమివ్వడం, బ్యాంకుల్లో, ఏటీఎంల్లో డబ్బులు దొరకక ప్రజలు తీవ్ర అవస్థ పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులతో కేంద్రం భేటీ అయింది. దేశంలోని ఆర్థిక కార్యకలాపాలు, లావాదేవీలు, నగదు ప్రవాహం సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీచేసింది. 24 గంటల్లో దేశంలోని 80శాతం ఏటీఎంలు పనిచేస్తాయని, నగదు అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం ఈ సందర్భంగా భరోసా ఇచ్చింది. ఆర్బీఐ కూడా నగదు కష్టాలపై స్పందించింది. ఏటీఎంల వద్ద పరిస్థితి మెరుగుపడుతోందని, నగదు కొరత కష్టాలు క్రమంగా తొలగిపోతున్నాయని ఆర్బీఐ వెల్లడించింది.