అత్తపై అత్యాచారం.... భార్యకు విడాకులు

SMTV Desk 2019-12-14 12:07:53  

మద్యం మత్తులో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. అత్త (భార్య తల్లి)పై అత్యాచారం చేశాడు. ఈ ఘటన హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కేరళలోని పాలక్కాడ్ కు చెందిన ఓ మహిళ నగరంలోని ఆసిఫ్ నగర్ లో ఉండేది. రెండేళ్లుగా తన కుమార్తె, అల్లుడు హార్ధిక్ గాంధీ ఇంట్లో ఉంటూ, మనవడిని చూసుకుంటోంది. కొంత కాలంగా ఆమె డిప్రెషన్ తో బాధపడుతోంది. గత నెల 13న మాత్రలు వేసుకుని ఆమె పడుకుంది. ఆరోజు అర్ధరాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన హార్ధిక్ ఆమె గదిలోకి వెళ్లి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

మరుసటి రోజు తన కుమార్తెకు జరిగిన విషయాన్ని బాధితురాలు వివరించింది. దీంతో, అప్పటికే ఇంటి నుంచి వెళ్లిపోయిన భర్తకు భార్య ఫోన్ చేసింది. ఇంటికి పిలిచి నిలదీసింది. క్షణికావేశంలో అలా చేశానని, తనను క్షమించాలని ఈ సందర్భంగా హార్ధిక్ కోరాడు. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. అనంతరం భార్య మరోసారి ఫోన్ చేయగా... ఇంటి నుంచి తాను వెళ్లిపోతున్నానని, నీకు విడాకులు ఇస్తానని, ప్రతి నెల భరణం ఇస్తానని చెప్పాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను స్పందించలేదు. దీంతో, బాధితురాలు, ఆమె కుమార్తె నిన్న రాత్రి పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.