ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్...హైదరాబాద్‌లో ఆందోళనలు

SMTV Desk 2019-12-16 11:35:49  

కేంద్ర ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులు ఆదివారం చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పలువుర్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆందోళనలకు దిగిన కొందరు స్థానికులు వర్సిటీలో తలదాచుకున్నారంటూ పోలీసులు లోనికి ప్రవేశించి బలవంతంగా కొందర్ని తీసుకెళ్లారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ (మను), హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆదివారం రాత్రి ‘మను’ విద్యార్థులు పెద్దఎత్తున విశ్వవిద్యాలయం మెయిన్ గేట్ వద్దకు చేరుకుని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జిని ఖండించారు. అర్ధరాత్రి సమయంలోనూ మెయిన్ గేట్ వద్ద బైఠాయించి డప్పులు వాయిస్తూ ఆందోళనను కొనసాగించారు. అటు హైదరాబాద్‌ సెంట్రల్ వర్సిటీలోనూ స్టూడెంట్‌ ఇస్లామిక్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో రాత్రి 11.30 గంటల ప్రాంతంలో నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా దిష్టిబొమ్మను దహనం చేసి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులకు ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీ సంఘీభావం ప్రకటించారు. ఇదిలా ఉండగా తమ అదుపులో ఉన్న 50 మంది జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులను వదలిపెట్టినట్టు పోలీసులు సోమవారం వెల్లడించారు. కల్‌కాజీ పోలీస్ స్టేషన్‌లో ఉన్న 35 మంది, న్యూ ఫ్రెండ్స్ కాలనీ స్టేషన్‌లో ఉన్న 15 మందిని విడుదల చేసినట్టు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ఆందోళనల్లో గాయపడిన విద్యార్థులకు సత్వరమే చికిత్స అందజేయాలని, పోలీసుల అదుపులో ఉన్నవారిని విడుదల చేయాని ఆదివారం అర్ధరాత్రి ఢిల్లీ మైనార్టీ కమిషన్ ఆదేశాలు జారీచేసింది. అంతేకాదు, సోమవారం మధ్యాహ్నం 3 గంటల్లోగా తమకు నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలను అమలుచేయడంలో విఫలమైతే తగు చర్యలు తీసుకుంటామని డీఎంసీ ఛైర్మన్ జఫారుల్ ఇస్లామ్ ఖాన్ హెచ్చరించారు.