కేసీఆర్‌, ఓవైసీలపై బిజెపి ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు

SMTV Desk 2020-01-04 13:15:14  

బిజెపి ఎంపీ ధర్మపురి అర్వింద్ శుక్రవారం నిజామాబాద్‌లో జరిగిన బహిరంగసభలో ప్రసంగిస్తూ సిఎం కేసీఆర్‌, అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. సిఎం కేసీఆర్‌ మజ్లీస్ అధినేతలకు తొత్తుగా మారారని ఆయన ఒక గడ్డం లేని ముల్లావంటివారని అర్వింద్ ఎద్దేవా చేశారు. ముస్లింల ఓట్లకోసమే సిఎం కేసీఆర్‌ సీఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. తెరాస, మజ్లీస్ పార్టీలు రెండూ కలిసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. నిజానికి సీఏఏ వలన దేశంలో ముస్లింలతో సహా భారతీయ పౌరులెవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండబోదని అన్నారు. దానిపై ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలు స్వయంగా భరోసా ఇస్తున్నా, తెరాస, మజ్లీస్, కాంగ్రెస్ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలలో భయాందోళనలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నాయి.

నిజామాబాద్‌ మేయర్ పదవిని మజ్లీస్ పార్టీకి కట్టబెట్టేందుకు కేసీఆర్‌, అసదుద్దీన్ ఓవైసీల మద్య రహస్య ఒప్పందం జరిగిందని అందుకే ఆయన నిజామాబాద్‌ వచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడిపోయారని ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. రాష్ట్రంలో బిజెపి ఎక్కడ ఉందో నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికలలో తన చేతిలో ఓడిపోయిన కవితను అడిగితే చెపుతారన్నారు ధర్మపురి అర్వింద్.

హైదరాబాద్‌ పాతబస్తీలో సొంత తమ్ముడిపై హత్యాప్రయత్నం జరిగితే కాపాడుకోలేకపోయిన అసదుద్దీన్ ఓవైసీ నిజామాబాద్‌ వచ్చి బిజెపి అంతు చూస్తానని బెదిరించడం హాస్యస్పదంగా ఉందని, ఆయన తన తీరు మార్చుకోకుంటే గట్టిగా బుద్ది చెపుతామని హెచ్చరించారు. తెరాస, మజ్లీస్ పార్టీలు ఎన్ని కుయుక్తులు పన్నినా మున్సిపల్ ఎన్నికలలో నిజామాబాద్‌లో బిజెపి గెలుపు ఖాయమని ధర్మపురి అర్వింద్ అన్నారు.