ఉద్యోగులకు శుభవార్త..... 5 ఏళ్ల కన్నా ముందే గ్రాట్యుటీ డబ్బులు!

SMTV Desk 2019-12-13 11:48:46  

మోదీ సర్కార్ కార్మిక చట్టాల సవరణ లక్ష్యంగా ముందుకు నడుస్తుంది. అందుకే సామాజిక భద్రత కోడ్‌ను అమలులోకి తీసుకురావాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. గ్రాట్యుటీ పొందాలంటే ఒక కంపెనీలో కనీసం ఐదేళ్లు పనిచేయాలి. అయితే ఉద్యోగులు ఐదేళ్లు పని చేయకపోయినా కూడా గ్రాట్యుటీ పొందే అవకాశం అందుబాటులోకి రావొచ్చు. సామాజిక ఆర్థిక భద్రత కోడ్ 2019 ఇందుకు దోహదపడుతోంది. అయితే ఈ ఫెసిలిటీ అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. కేవలం కొంత మంది ఉద్యోగులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ వర్కర్లకు గ్రాట్యుటీ రూల్స్‌ను సవరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వీరికి గ్రాట్యుటీ మొత్తాన్ని ఐదేళ్ల సర్వీస్ లేకపోయినా కూడా అందజేయాలని యోచిస్తోంది. అంటే వీరి కాంట్రాక్ట్ ముగిసిన వెంటనే (ఐదేళ్లు పనిచేయకపోయినా) గ్రాట్యుటీ పొందొచ్చు. ప్రో-రాటా ప్రాతిపదికన వీరికి గ్రాట్యుటీ బెనిఫిట్స్ లభిస్తాయి. మోదీ సర్కార్ కొత్త బిల్లు ద్వారా కోడ్ ఆన్ వేజెస్, ఆక్యూపేషనల్ సేఫ్టీ హెల్త్ వర్కింగ్ కండీషన్స్ కోడ్, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ వంటి వాటిని అమలులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఇప్పటికే ఈ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్లమెంట్‌లో కూడా దీన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇది చట్టంగా మారుతుంది. ఇదే జరిగితే 44 పాత కార్మిక చట్టాలకు మంగళం పాడినట్లు అవుతుంది. ఇకపోతే మిగతా ఉద్యోగులకు ఐదేళ్ల కనీస సర్వీస్ తప్పనిసరి. ఒక కంపెనీలో కనీసం ఐదేళ్లు పనిచేస్తేనే గ్రాట్యూటీ డబ్బులు లభిస్తాయి. పదవీ విరమణ, రాజీనామా, చినపోయినప్పుడు, అంగవైకల్యం వంటి సందర్భాల్లో గ్రాట్యుటీ డబ్బులు తీసుకోవచ్చు. ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైక్యలం ఏర్పడినా అప్పుడు సర్వీస్‌తో నిమిత్తం లేకుండా సదురు ఎంప్లాయికి గ్రాట్యుటీ చెల్లిస్తారు. గ్రాట్యుటీ చెల్లింపులను లెక్కించేందుకు, ఒక నెలలో పనిదినాలను 26 రోజులుగా చూస్తారు. కాబట్టి 15 రోజులకు సమానమైన వేతనాన్ని.. నెల వేతనం (ఇంటూ) 15/26గా లెక్కిస్తారు. ఇలా వచ్చిన సంఖ్యను ఎన్నేళ్ల సర్వీసు ఉంటే అన్నేళ్లకు లెక్కవేసి గ్రాట్యుటీని చెల్లిస్తారు. ఉద్యోగి సర్వీస్ 6 నెలల కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు దాన్ని ఏడాదిగా పరిగణలోకి తీసుకుంటారు. అంటే ఉద్యోగి సర్వీస్ 6 ఏళ్ల 8 నెలలు అనుకుంటే.. అప్పుడు 7 ఏళ్లను సర్వీస్ కింద భావిస్తారు.