చెన్నైకు మరో ఎదురుదెబ్బ..

SMTV Desk 2018-04-14 13:27:59  lungi ngidi, chennai super kings, ipl, kedar jadhav

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14 : పునరాగమనం.. ఘనం.. ఆడిన రెండు మ్యాచ్ ల్లో అద్భుత విజయం.. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్ కే) అభిమానులకు ధోని జట్టు సూపర్ మజాను ఇచ్చింది. ఎంతో ఒత్తిడిలో ఆ జట్టు విజయాలు మర్చిపోలేనివి. కానీ ఇది నాణేనికి ఒక వైపు.. రెండో వైపు జట్టుకు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ కేదార్‌ జాదవ్‌ ఇప్పటికే ఈ ఏడాది టోర్నీ నుంచి తప్పుకున్నాడు. గాయం కారణంగా సురేశ్‌ రైనా రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. సొంతగడ్డపై ఆడాల్సిన మ్యాచ్‌లు పుణెలో ఆడాల్సి వచ్చింది.. తాజాగా ఇప్పుడు మరో ఆటగాడు మొత్తం టోర్నీ నుంచి దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. చెన్నై జట్టు కు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్ బౌలర్ లుంగీ ఎంగిడి తండ్రి మరణించడంతో స్వదేశానికి వెళ్లాడు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఎంగిడికి అవకాశం కల్పించలేదు. మిచెల్‌ శాంట్నర్‌ దూరం కావడం, మార్క్‌వుడ్‌ అనుకున్న రీతిలో ప్రదర్శన చేయకపోవడంతో తదుపరి మ్యాచ్‌ల్లో ఎంగిడికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నా తరుణంలో ఎంగిడి దూరమయ్యాడు. ఈ సమయంలో అనుకోకుండా లుంగీ ఎంగిడి ఐపీఎల్‌కు దూరం కావాల్సి వచ్చింది. తిరిగి ఐపీఎల్‌లో ఆడేందుకు వస్తాడో రాడో అన్న అనుమానాలు నెలకొన్నాయి. ఇది చెన్నై సూపర్‌కింగ్స్‌కు పెద్ద ఎదురుదెబ్బే. టోర్నీలో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ తర్వాతి మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో తలపడనుంది.