రిషబ్ పంత్‌‌పై సెటైర్ల వర్షం!

SMTV Desk 2019-12-12 14:46:44  

భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని స్థానంలో వచ్చిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. ఉప్పల్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 9 బంతులాడి 18 పరుగులకే ఔటైన రిషబ్ పంత్.. ఆ తర్వాత తిరువనంతపురం టీ20లో 22 బంతులాడి 33 పరుగులే చేశాడు. ఇక వాంఖడే టీ20లో అతడ్ని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు పంపి మరీ విరాట్ కోహ్లీ అవకాశం ఇవ్వగా.. ఆఫ్ స్టంప్‌కి వెలుపగా ఊరిస్తూ పొలార్డ్ విసిరిన బంతిని లాంగాఫ్ దిశగా హిట్ చేసి బౌండరీ లైన్ వద్ద హోల్డర్‌కి సులువైన క్యాచ్ ఇచ్చేశాడు. వాస్తవానికి అప్పటికి భారత్ జట్టు 12.1 ఓవర్లలో 138/1తో తిరుగులేని స్థితిలో ఉంది. ఆ దశలో బ్యాటింగ్‌ చేస్తూ అతను ఒత్తిడికి గురవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాకి ధోనీ దూరమవగా.. రిషబ్ పంత్‌కి వన్డే, టీ20ల్లో భారత సెలక్టర్లు వరుస అవకాశాలిస్తూ వస్తున్నారు. ప్రత్యామ్నాయ వికెట్ కీపర్‌గా సంజు శాంసన్‌ని జట్టులోకి సెలక్టర్లు ఇటీవల ఎంపిక చేసినా.. అతనికి మాత్రం తుది జట్టులో ఒక్క అవకాశం కూడా ఇవ్వని టీమిండియా మేనేజ్‌మెంట్.. రిషబ్ పంత్‌ వరుసగా విఫలమవుతున్నా ఛాన్స్‌లు ఇస్తోంది. జట్టులో ధోనీ స్థానాన్ని వికెట్ కీపర్‌గానే కాకుండా ఫినిషర్‌గానూ భర్తీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న రిషబ్ పంత్ హిట్టింగ్‌కి పోయి తన కెరీర్‌నే ప్రశ్నార్థకంగా మార్చుకుంటున్నాడు.