కోపం వచ్చినప్పుడు కెమెరా ఎక్కడుందో చూసుకుని జాగ్రత్త పడతా

SMTV Desk 2019-11-09 17:07:55  

బంగ్లాదేశ్ తో రాజ్ కోట్ లో జరిగిన రెండో టి20 మ్యాచ్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ సందర్భంలో విపరీతమైన ఆగ్రహం వ్యక్తం చేశాడు. చాహల్ బౌలింగ్ లో బంగ్లా బ్యాట్స్ మన్ సౌమ్య సర్కార్ ను పంత్ స్టంపౌట్ చేశాడు. దీన్ని థర్డ్ అంపైర్ అనిల్ చౌదరి పరిశీలించి మొదట నాటౌట్ అని తేల్చాడు. స్టేడియంలో ఉన్న భారీ తెరపై నాటౌట్ అని రావడం చూసి రోహిత్ శర్మ అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. పరుష పదజాలంతో థర్డ్ అంపైర్ అనిల్ చౌదరిపై మండిపడ్డాడు. ఆ మరుక్షణమే స్క్రీన్ పై అవుట్ అని డిస్ ప్లే కావడంతో రోహిత్ ఆగ్రహం చల్లారింది.

అయితే రోహిత్ కోపతాపాలు టెలివిజన్ స్క్రీన్ పై స్పష్టంగా కనిపించడమే కాదు, తిట్లపురాణం కూడా స్టంప్ మైక్ ద్వారా వినిపించింది. దీనిపై రోహిత్ మీడియాతో మాట్లాడుతూ, తానెప్పుడూ మైదానంలో భావోద్వేగాలతో ఉంటానని తెలిపాడు. ఎలాగైనా మ్యాచ్ గెలవాలన్న సమయాల్లో భావోద్వేగాలకు లోనవడం సహజమేనని వెల్లడించాడు. అయితే ఈసారి కోపం వచ్చినప్పుడు కెమెరా ఎక్కడుందో చూసుకుని జాగ్రత్త పడతానని చమత్కరించాడు. తొలి మ్యాచ్ లో ఓటమి కారణంగా రెండో మ్యాచ్ ను తేలిగ్గా తీసుకోలేకపోయామని, అందుకే కొంత తీవ్రత తనలో కనిపించి ఉండొచ్చని అన్నాడు.

మూడు టి20 మ్యాచ్ ల ఈ సిరీస్ లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో సిరీస్ 1-1తో సమంగా ఉంది. నాగ్ పూర్ వేదికగా రేపు మూడో టి20 మ్యాచ్ జరగనుంది.