164 బంతుల్లో 15 ఫోర్లతో 101 పరుగులు

SMTV Desk 2019-11-30 16:25:59  

హామిల్టన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. వర్షం వల్ల పూర్తి మ్యాచ్ సాధ్యం కాలేదు. శుక్రవారం మొదటి రోజు కేవలం 54.3 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఇందులో న్యూజిలాండ్ ఆధిపత్యం చెలాయించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ జీత్ రావల్ ఐదు పరుగులు మాత్రమే చేసి బ్రాడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మరోవైపు వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా విఫలమయ్యాడు.

4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. క్రిస్ వోక్స్ అద్భుత బంతితో విలియమ్సన్‌ను వెనక్కి పంపాడు. దీంతో కివీస్ 39 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను మరో ఓపెనర్ టామ్ లాథమ్ తనపై వేసుకున్నాడు. అతనికి సీనియర్ ఆటగాడు రాస్ టైలర్ అండగా నిలిచాడు. ఇద్దరు కలిసి ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలుగా మలుస్తూ స్కోరును పరిగెత్తించారు. ఈ జోడీని విడగొట్టేందుకు ఇంగ్లండ్ బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇటు లాథమ్, అటు రాస్‌లు కుదురుగా ఆడడంతో కివీస్ స్కోరు 100 దాటింది.

సమన్వయంతో ఆడిన రాస్ 8 ఫోర్లతో 53 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇదే సమయంలో లాథమ్‌తో కలిసి మూడో వికెట్‌కు వందకు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మరోవైపు లాథమ్ అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న లాథమ్ 164 బంతుల్లో 15 ఫోర్లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ సమయంలో వర్షం రావడంతో ఆటను నిలిపి వేశారు. అప్పటికే కివీస్ స్కోరు 173 పరుగులకు చేరింది.