థాయ్‌లాండ్‌లో బర్త్‌డే సెలెబ్రేట్ చేసుకున్న యువీ

SMTV Desk 2019-12-13 11:45:25  

టీమిండియా సిక్సర్ల వీరుడు యువరాజ్‌ సింగ్‌ తన 38వ పుట్టినరోజు వేడుకలను గురువారం థాయ్‌లాండ్‌లో ఘనంగా జరుపుకొన్నాడు. భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌, మాజీ పేసర్‌ అజిత్‌ అగార్కర్‌, స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌తో కలిసి థాయ్‌లాండ్‌లో సరదాగా గడిపాడు. ఈ ఫొటోలను భజ్జీ షేర్‌ చేస్తూ.. కలకాలం సంతోషంగా ఉండాలి. హ్యాపీ బర్త్‌డే యువీ అని ట్వీట్‌ చేశాడు. సూపర్‌స్టార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. దేవుడు నీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నా అని సచిన్‌ ట్వీటాడు. పార్టీ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు సోషల్‌మీడియాలో యువీకి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఐసీసీ, బీసీసీఐ, క్రికెటర్లు, మాజీలు, అభిమానులు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది జూన్‌లో యువరాజ్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌ భారత్‌ సాధించడంలో యువీ కీలక పాత్ర పోషించాడు. ఆల్‌రౌండర్‌గా టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు.