మ్యాచ్ జరిగితే పాములు వదులుతా౦

SMTV Desk 2018-04-10 17:38:58  chennai super kings, ipl,kolkatha knight riders, chepak stadium

చెన్నై, ఏప్రిల్ 10 : ఐపీఎల్‌-11 సీజన్‌కు కావేరీ జలాల వివాదం భయపెడుతుంది. రెండేళ్ల నిషేధం తర్వాత సొంతగడ్డపై చెన్నై సూపర్‌కింగ్స్‌ తొలి మ్యాచ్‌ ఆడనున్న విషయం తెలిసిందే. సొంత ప్రేక్షకుల మధ్య ఈ రోజు చెపాక్‌ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేసేవరకు చెన్నైలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరపవద్దని పలు రాజకీయ, ప్రజాసంఘాలు తీవ్రంగా డిమాండ్‌ చేస్తున్నాయి. ఒక వేళ మ్యాచ్‌లను నిర్వహిస్తే అడ్డుకోని తమ నిరసన తెలియజేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. తాజాగా పీఎంకే నేత వేల్‌మురుగన్‌ చేసిన ప్రకటన ఒకటి వివాదాస్పదంగా మారింది. తమ మాట కాదని మ్యాచ్‌ నిర్వహించాలని చూస్తే మైదానంలోకి పాములను వదులుతామని ఆయన హెచ్చరించడం సంచలనంగా మారింది ఇప్పటికే ఆందోళనకారులు నల్లటి వస్త్రాలతో మ్యాచ్‌లకు హాజరై తమ నిరసన తెలియజేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు. అయితే మ్యాచ్‌ నిర్వాహకులు మాత్రం నల్లటి వస్త్రాలు, రిస్ట్‌ బ్యాండ్స్‌, బ్యాడ్జెస్‌లతో వచ్చే అభిమానులను స్టేడియంలోకి అనుమతించబోమని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.