పేపర్‌ లీక్‌ కేసులో మరో ముగ్గురి అరెస్టు

SMTV Desk 2018-04-01 11:36:58  cbse, question, paper, leeke, arrested

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: సీబీఎస్‌ఈ పేపర్‌ లీక్‌ కేసులో ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఆదివారం ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు. 12వతరగతి ఆర్థిక శాస్త్రం పేపర్‌లీక్‌కు సంబంధించి ఓ శిక్షణాసంస్థ యజమాని, మరో ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. రోహిత్‌, రిషాబ్‌ అనే ఇద్దరు ఉపాధ్యాయులు ఆర్థిక శాస్త్రం ప్రశ్నాపత్రాన్ని ఓ కోచింగ్‌ సంస్థను నడుపుతున్న తాఖిర్‌ అనే వ్యక్తికి వాట్సాప్‌ ద్వారా పంపించారన్న ఆరోపణలతో వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుతో సంబంధమున్న 60మందిని పోలీసులు ప్రశ్నించారు. ఇందులో 10మంది ప్రైవేటు విద్యాసంస్థల ట్యూటర్లు కావడం గమనార్హం. ఈ కేసుకు సంబంధించి ఝార్ఖండ్‌లోని ఛత్రా జిల్లాకు చెందిన 12 మందిని ఆరాష్ట్ర పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పదోతరగతి గణిత ప్రశ్నాపత్రం లీక్‌తో సంబంధం ఉందన్న ఆరోపణలతో ఏడుగురు విద్యార్థులతోపాటు మరో ఐదుగురు కోచింగ్‌ సంస్థ యజమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిదగ్గరున్న ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.