ఆరెంజ్ ఆర్మీ నాయకత్వం నుండి వార్నర్ ఔట్..

SMTV Desk 2018-03-28 13:31:52  david warner, Sunrisers Hyderabad,

హైదరాబాద్, మార్చి 28 : బాల్ టాంపరింగ్ వివాదంతో సతమవుతున్న ఆసీస్ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ ఐపీఎల్‌లో సన్ రైజర్స్ టీం నాయకత్వం నుండి తప్పుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో విజయం కోసం ఆస్ట్రేలియా ఆటగాడు బాన్ క్రాఫ్ట్ బాల్ టాంపరింగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో యావత్ క్రీడాలోకం విస్మయం చెందింది. దీనికి బాధ్యులుగా కంగారుల జట్టు సారథి స్మిత్, ఉప సారథి వార్నర్ పై ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా( సీఏ) చర్యలుకు ఉపక్రమించింది. 24 గంటల్లో వారిపై తీసుకునే చర్యలను కూడా ప్రకటిస్తామని సీఏ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సదర్లాండ్‌ తెలిపారు. "ఆసీస్‌ క్రికెట్‌లో తాజాగా చోటు చేసుకున్న బాల్‌టాంపరింగ్‌ ఉదంతం కారణంగా డేవిడ్‌ వార్నర్‌ స్వతహాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. త్వరలోనే కొత్త నాయకుడు ఎవరో వెల్లడిస్తాం’ అని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సీఈవో షణ్ముగం ట్వీట్‌ చేశారు. మరి సన్‌రైజర్స్‌ ఎవరికీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తుందో చూడాలి. కాగా ఆరెంజ్ ఆర్మీకు భారత్ ఆటగాడు శిఖర్ ధావన్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడని వార్తలు వస్తున్నాయి.