బంగ్లా భరతం పట్టాలి..

SMTV Desk 2018-03-18 11:48:00  india vs bangladesh,nidahas trophy, rohith sharma, srilanka

కొలంబో, మార్చి 18 : శ్రీలంకతో తొలి మ్యాచ్ లో ఓడిన రోహిత్ సేన తర్వాత మూడు మ్యాచ్ ల్లో నెగ్గి ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. ముక్కోణపు టీ-20 టోర్నీ లో భాగంగా బంగ్లాదేశ్ తో తుది పోరుకు టీమిండియా సిద్దమయ్యింది.నిదహాస్ ట్రోఫీ లో జరిగిన లీగ్ మ్యాచ్ లన్నిటిలో బంగ్లా టీమిండియా చేతిలో ఓటమి పాలుకావడం మనజట్టుకు అతిపెద్ద సానుకూలాంశం. అంతే కాకుండా టీ-20ల్లో భారత్ బంగ్లాపై ఓక్కసారీ ఓడకపోవడం విశేషం. కానీ శ్రీలంకపై సాధించిన రెండు విజయాలు బట్టి బంగ్లాదేశ్ ఎంత ప్రమాదమైన జట్టో తెలుస్తుంది. టీమిండియా జట్టుతో ఓడిన రెండు మ్యాచ్ ల్లో ఆ జట్టు పోరాటపటిమ ప్రదర్శించింది. భారత్ జట్టులో బ్యాటింగ్ పరంగా సారథి రోహిత్ శర్మ ఫామ్ లోకి రావడం, ధావన్, రైనా రాణించడం జట్టుకు లాభించే అంశం. మనీష్‌ పాండే, దినేశ్‌ కార్తీక్‌ కూడా ఒక్కో మ్యాచ్‌లో బాగానే ఆడారు. బ్యాటింగ్‌ బాధ్యతను టాప్‌-5 బ్యాట్స్‌మెనే నెరవేర్చారు. మరో వైపు బౌలింగ్ లో వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్ వచ్చిన అవకాశాన్ని బాగానే సద్వినియోగం చేసుకున్నారు. మరోసారి వీరందరూ రాణిస్తే టీమిండియా కప్ గెలవడం నల్లేరు మీద నడక అవుతుంది. మరో వైపు ప్రత్యర్ధి జట్టులో ముందు మ్యాచ్‌ల్లో ముష్ఫికర్‌, చివరి మ్యాచ్‌లో మహ్మదుల్లా అదరగొట్టే బ్యాటింగ్ తో జట్టును ఫైనల్ కు చేర్చారు. ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌, షకిబ్‌ అల్‌హసన్‌, షబ్బీర్‌ రెహ్మాన్‌, సౌమ్య సర్కార్‌లతో బంగ్లా బ్యాటింగ్‌ బలంగా ఉంది. బౌలింగ్‌లో ముస్తాఫిజుర్‌, రుబెల్‌ హుస్సేన్‌, తస్కిన్‌ అహ్మద్‌, మెహదీ హసన్‌ లాంటి ప్రతిభావంతులున్నారు. ఒక్క ఓవర్లోనే ఫలితాలు మార్చే టీ-20 మ్యాచ్ విజేత ఎవరనేది తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే..!