ఆదిశక్తిగా మారిన యువతి

SMTV Desk 2018-02-28 18:41:08  eve teasing, arrested, delhi, women dare

దిల్లీ, ఫిబ్రవరి 28 : సమాజంలో మహిళలపై రోజురోజుకి జరుగుతున్నా అఘాయిత్యాలు రాతియుగం నాటి సంస్కృతిని తలపిస్తున్నాయి. ముఖ్యంగా యువకులు విచక్షణ మరచి చేస్తున్న అల్లర్లు పై మహిళలు తిరగబడే రోజులు రావాలి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువతి తనను వేధించిన ఆకతాయిని కొట్టడమే కాకుండా, పోలీస్ స్టేషన్ వరకు ఈడ్చుకెళ్లి తన తెగువను చాటుకోంది. వివరాల్లోకి వెళితే.. వెస్ట్‌ దిల్లీలో రద్దీగా ఉన్న గఫ్ఫార్‌ మార్కెట్‌లో ఓ యువతి తన స్నేహితులతో కలిసి నడుస్తుండగా.. నలుగురైదుగురు అబ్బాయిలు వెనుక వస్తూ అసభ్యంగా వ్యాఖ్యలు చేస్తూ వేధింపులకు గురిచేశారు. దీంతో వారిని తప్పించుకునేందుకు అమ్మాయిలు ఆటో ఎక్కారు.అయినా ఆ పోకిరీలు ఆగలేదు. ఆటోను కూడా ఫాలో అవుతూ అసభ్యంగా కామెంట్లు చేస్తూ వచ్చారు. దీంతో ఓ యువతికి ఓపిక నశించి ఆటో ఆపి కిందకు దిగి పట్టరాని కోపంతో పోకిరీల్లో ఒకడిని కాలర్‌ పట్టుకుని చెంప పగలగొట్టింది. ఆమె అంతటితో ఆగకుండా వాడిని కాలర్‌ పట్టుకుని సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు లాక్కుపోయింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరు యువకులను అరెస్ట్‌ చేశారు. వారిని హరియాణాకు చెందిన మనీశ్‌, అభిషేక్‌లుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.