మోదీ విదేశీ పర్యటన నేడే

SMTV Desk 2017-06-24 16:16:59  India and the Americas, Tour, narendra modi, tramp, antoniyo, porchgal, nedarlands

న్యూ ఢిల్లీ, జూన్ 24 : భారత్, అమెరికాల ద్వైపాక్షిక భాగస్వామ్యానికి పురోగామి దృష్టిని సమకూర్చడం, సంబంధాలను పరిపుష్టం చేయడం లక్ష్యంగా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో చర్చలు జరుపబోతున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. అమెరికా, పోర్చుగల్, నెదర్లాండ్స్ దేశాల్లో జరుపనున్న పర్యటనపై శుక్రవారం రాత్రి ట్విట్టర్ లో, ఫేస్ బుక్ లో ప్రధాని పలు సందేశాలు పెట్టారు. శనివారం ముడుదేశాల పర్యటనకు బయలుదేరనున్న ప్రధాని ముందుగా పోర్చుగల్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధాని అంటోనియో కోస్టాతో చర్చలు జరుపుతారు. 26వ తేదీ ట్రంప్ తో భేటీలో అనేక అంశాలపై అభిప్రాయాలు పంచుకోనున్నట్లు ప్రధాని మోదీ ట్విట్టర్ లో తెలిపారు. ట్రంప్ ఆహ్వానం మేరకు అమెరికా వెళ్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రెండు దేశాల సంబంధాలు బలపడితే ప్రపంచానికి కూడా మేలు జరుగుతుందని వెల్లడించారు. అమెరికాతో భారత్ భాగాస్వామ్యం వైవిధ్యంతో కూడుకుని ఉంటుందని అన్నారు. అమెరికాలో ఎన్నారైలు, సీఈవోలు తదితరులతో ప్రధాని మోదీ వేరువేరు సమావేశాల్లో పాల్గొంటారు. ఈ నెల 27న నెదర్లాండ్స్ లో పర్యటిస్తారు. ఆ దేశ రాజు విల్లెం అలెగ్జాండర్, రాణిమాగ్జిమా, ప్రధాని మార్క్ రట్టి తదితరులతో ప్రధాని భేటీ అవుతారు. ఈ పర్యటనల సందర్భంగా ఎన్నారైలతోనూ, కంపెనీల సీఈవోలతోనూ ప్రధాని సమావేశం అవ్వనున్నారు.