ఇస్రో@ 100

SMTV Desk 2018-01-10 16:01:57  isro, 100 sattilite, pslv, record

బెంగళూరు, జనవరి 10: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన 100వ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. ఇస్రో అమ్ములపొదిలో ఈ ప్రయోగం మైలురాయిగా నిలిచిపోనుంది. ఈ నెల 12న జరిగే ఈ ప్రయోగంలో భారత్‌కు చెందిన కార్టోశాట్‌-2తోపాటు మరో 30 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ద్వారా ప్రయోగించనున్నారు. ఇందులో విదేశాలకు చెందిన 28 ఉపగ్రహాలు ఉన్నాయని ఇస్రో ఉపగ్రహ కేంద్రం సంచాలకుడు ఎం.అన్నాదొరై పేర్కొన్నారు. "ఈ ప్రయోగంలో భారత్‌కు చెందిన మూడు ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. వాటిలో చివరి ఉపగ్రహం.. కక్ష్యలోకి చేరగానే అది ఇస్రోకు వందో శాటిలైట్‌ అవుతుంది. ఈ ప్రయోగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం" అని ఆయన తెలిపారు. మునుపటి ప్రయోగంలో పీఎస్‌ఎల్‌వీ విఫలమైన సంగతి తెలిసిందే. దీనిపై స్పందిస్తూ.. దాన్ని ఇస్రో అర్థం చేసుకుందని, సమస్య పునరావృతం కాకుండా పలుమార్లు పరీక్షలు నిర్వహించినట్లు అన్నాదొరై వివరించారు. అందువల్లే తదుపరి ప్రయోగం కోసం ఎక్కువ సమయం తీసుకొని విజయవంతానికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఆగస్టు 31న జరిపిన ప్రయోగంలో పీఎస్‌ఎల్‌వీ-సి39 విఫలమైన సంగతి తెలిసిందే.