దేశంలో గంటకో విద్యార్ధి ఆత్మహత్య..!

SMTV Desk 2018-01-08 15:36:10  suicide, students, one hour, one, country

న్యూ డిల్లీ, జనవరి 08: ప్రతి చిన్న కారణానికి నేటి యువత ఎంచుకుంటున్న మార్గం ఆత్మహత్య. పరీక్షలో ఫెయిల్‌ అయ్యాననో.. మార్కులు తక్కువగా వచ్చాయనో.. టీచర్‌ కొట్టిందనో.. అమ్మానాన్న తిట్టారనో.. ఇలా కారణాలేవైనా ఈ మధ్యకాలంలో విద్యార్థులు చిన్న చిన్న వాటికే మనస్తాపానికి గురవుతూ ఒత్తిడికి లోనవుతున్నారు. ఆ ఒత్తడికి తట్టుకోలేక అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ముఖ్యంగా ఓడిపోతున్నామనే భావనతో చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మన దేశంలో గంటకు ఓ విద్యార్థి చొప్పున ఆత్మహత్య చేసుకుంటున్నాడు. 2016లో దేశవ్యాప్తంగా విద్యార్థుల బలవన్మరణాలపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నివేదిక సమర్పించాయి. దీని ప్రకారం.. ఆ ఏడాది 9,474 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే 24 గంటలకు 26 బలవన్మరణాలు నమోదయ్యాయి. వీటిలో మహారాష్ట్ర, పశ్చిమ బంగా రాష్ట్రాల్లో ఎక్కువ మరణాలు చోటుచేసుకోగా.. సున్నా మరణాలతో లక్ష్యద్వీప్‌ నిలిచింది. 2014 నుంచి ఈ పరిస్థితి ఇలాగే ఉందని నివేదిక తెలిపింది. 2014-16 మధ్య దేశంలో 26,476 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు.