రాష్ట్రపతి భవన్‌ సందర్శనకు అందరూ ఆహ్వానితులే: రామ్ నాథ్ కోవింద్

SMTV Desk 2018-01-08 14:36:10  president house, visit, ramnadh kovind, tweet

న్యూ డిల్లీ, జనవరి 08: భారత ప్రథమ పౌరుడు రాష్ట్రపతి నివాసముండే నిలయం రాష్ట్రపతి భవన్‌. దేశ రాజధాని డిల్లీలో ఉన్న ఈ అపురూప కట్టడాన్ని తిలకించేందుకు ప్రతిఒక్కరు ఆసక్తి కనబరుస్తారు కానీ పోలీసు అధికారులు రానిస్తారో లేదోనని భయపడుతారు. కానీ దీని సందర్శన కోసం రావాలంటూ సాక్షాత్‌ రాష్ట్రపతే ఆహ్వానించారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌, ట్విటర్‌లో పోస్టులు చేశారు. "భారత గణతంత్రానికి నిదర్శనం ఈ నిలయం. ఇది ప్రతి ఒక్క భారతీయుడిది. రాష్ట్రపతి భవన్‌ను సందర్శించాలని ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నా. విచ్చేయండి.. సందర్శించండి"అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సోషల్‌ మీడియాలో తెలియజేసారు. కేవలం ఆహ్వానించడమే కాదు.. పర్యటకులను ఆకట్టకునేలా రాష్ట్రపతి భవన్‌ వీడియోను షేర్‌ చేశారు. 43 సెకండ్ల పాటు ఉన్న ఈ వీడియోలో భవనంలోని దర్బార్‌ హాల్‌, అశోకా హాల్‌ వంటి ప్రముఖ ప్రదేశాలను చూపించారు. రాష్ట్రపతి నిలయంలోని ప్రముఖ గదుల్లో ఒకటి ఈ దర్బార్‌ హాల్‌. సాధారణంగా ఇక్కడ కొత్తగా ఏర్పడే కేంద్ర ప్రభుత్వాల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు జరుగుతుంటాయి. భారత ప్రధాన న్యాయమూర్తి కూడా ఇక్కడే ప్రమాణం చేస్తారు. భారతరత్న లాంటి ప్రతిష్ఠాత్మక అవార్డులను ఈ హాల్‌లోనే ప్రదానం చేస్తారు. ఇక విదేశీ ప్రతినిధులు భారత పర్యటనకు వచ్చినప్పుడు వారి పరిచయ కార్యక్రమాలను అశోకా హాల్‌లో నిర్వహిస్తుంటారు. ఏటా వేల సంఖ్యలో పర్యటకులు ఈ నిలయాన్ని సందర్శిస్తుంటారు. విదేశీ పర్యటకులు కూడా వస్తుంటారు. ఈ భవన సందర్శనకు 8ఏళ్ల పైబడిన వారికి రూ.50 చొప్పున ప్రవేశ రుసుము తీసుకుంటారు. ఇంకెందు ఆలస్యం వెళ్లి రాష్ట్రపతి భవన్ అందాలను తిలకిద్దమా..!