జీశాట్‌ 11 శాటిలైట్‌ ప్రయోగానికి ఇస్రో సన్నద్ధం

SMTV Desk 2018-01-07 10:51:03  isro, gsat 11, sattilite, kiran kumar

న్యూ డిల్లీ, జనవరి 07: మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సిద్దమవుతోంది. భారత్‌ ఇప్పటివరకూ నిర్మించినవాటిలో అత్యంత బరువైన ఉపగ్రహం జీశాట్‌-11ను ఇస్రో ప్రయోగించనున్నది. దీని బరువు ఆరు టన్నులు. ఇది ఈ ఉపగ్రహం దేశంలో ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్‌ సేవలను మరింత మెరుగుపరచనుంది. ఇది గ్రామీణ భారతానికి ఒక వరమని నిపుణులు చెబుతున్నారు. ఈ ఉపగ్రహాన్ని ఫ్రెంచ్‌ గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి మరికొద్ది రోజుల్లో ప్రయోగించనున్నారు. ఏరియాన్‌-5 రాకెట్‌ ద్వారా దీన్ని కక్ష్యలోకి పంపుతారు. ప్రస్తుతం దీన్ని ఫ్రెంచ్‌ గయానాకు పంపేందుకు సిద్ధం చేస్తున్నారు. ‘‘దేశానికి కొత్త సామర్థ్యాన్ని కల్పించే దిశగా మేం సాగిస్తున్న కసరత్తు ఇది. గ్రామ పంచాయతీలు, తాలుకాలు, భద్రతా దళాలకు ఇది ఉపయోగకరం’’ అని ఇస్రో ఛైర్మన్‌ కిరణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఇప్పటివరకూ భారత్‌ ప్రయోగించిన అన్ని సమాచార ఉపగ్రహాల ఉమ్మడి సామర్థ్యం కన్నా జీశాట్‌-11 శక్తిమంతమైనది. ఇదొక్కటే 30 ఉపగ్రహాలకు సమానం. ఈ ఉపగ్రహం ఖరీదు రూ.500 కోట్లు. దీని సౌరఫలకాలు కూడా భారీగానే ఉన్నాయి. ఒక్కో ఫలకం నాలుగు మీటర్లు పొడవు ఉంది.