డార్జిలింగ్ లో ఉద్రిక్తత

SMTV Desk 2017-06-18 16:11:08  Gurkhaland,BJM,Darjiling,Mamata Benarji, Raj nad singh

డార్జిలింగ్, జూన్ 18 : గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రం సాధించడమే ధ్యేయంగా పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ పర్వత ప్రాంతాల్లో 10 రోజులుగా జరుగుతున్న అల్లర్లలో శనివారం మరింత హింసాత్మకమైన వాతావరణం చోటు చేసుకుంది. డార్జిలింగ్ లోని సింగమారిలో పోలీసులు, గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం ) కార్యకర్తలకు మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి మరణించాడు. జూన్ 8 న ఘర్షణలు మొదలైన తర్వాత తొలి మరణం సంభవించింది. ఉద్యమం కారణంగా సింగమారి సహా డార్జిలింగ్ లో కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం నిషేదాజ్ఞలు అమలులో ఉండడంతో శనివారం బీజెఎం కార్యకర్తలు త్రివర్ణ పతాకం, వారి పార్టీ జెండాలను పట్టుకుని నిరసన కార్యక్రమాలు చేపట్టగా భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకుని కార్యకర్తలను ఆ ప్రదేశం వదిలి వెళ్ళాలని ఆదేశాలు జారీ చేశారు. అందుకు నిరాకరించిన జీజేఎం కార్యకర్తలు సిబ్బందిపై పెట్రోల్ బాంబులు, రాళ్ళు విసరడంతో పోలీసులు భాస్పవాయువు గోళాలను ప్రయోగించారు. దీనితో ఆందోళనకారులు చెదిరిపోయారు. లేబొంగ్ కార్డ్ రోడ్, చౌక్ బజార్, ఘుమ్ ప్రాంతాల్లోను హింస చెలరేగింది. 35 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఇండియా రిజర్వు బెటాలియన్ (ఐఆర్ బీ ) కి చెందిన అధికారి కిరణ్ తమంగ్ సహా మొత్తం 19 మంది క్షతగాత్రులయ్యారు. ఏడుగురు జీజేఎం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి కేంద్ర హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ ఫోన్ చేసి అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారూ. అల్లర్లపై మమత మాట్లాడుతూ ఇది చాలా రోజుల క్రితమే ఏర్పరచుకున్న వ్యూహమే అని, ఒక్క రోజులో మారణాయుధాలను విరివిగా సమకూర్చుకోవడం సాధ్యం కాదని వివరించారు. ఆందోళనకారుల వెనుక ఈశాన్య ప్రాంతంలోని కొన్ని తిరుగుబాటు వర్గాలు, విదేశీయుల హస్తం ఉందని ఆరోపించారు. ప్రాణం పోయే వరకు బెంగాల్ ను విడదీయకుండా ఉంచుతానని ఆమె శపథం చేశారు.