ఇదే మాకు మంచి అవకాశం : సాహా

SMTV Desk 2017-12-19 19:14:37  Wriddhiman Saha, indian test keeper, south africa, india

న్యూఢిల్లీ, డిసెంబర్ 19 : భారత్ జట్టు శ్రీలంకతో టీ-20 సిరీస్ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ప్రస్తుతం టీమిండియా జట్టు స్వదేశంలో ఓటమి లేకుండా సిరీస్ లను దక్కించుకుంది. కానీ సౌతాఫ్రికా టూర్ భారత్ సారధి కోహ్లీకి కఠిన పరీక్ష కానుంది. ఈ సందర్భంగా భారత్ జట్టు వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా మాట్లాడుతూ.. "దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్‌ గెలవడానికి ఇదే మంచి అవకాశం. గత రెండేళ్లుగా టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తూ విజయాలు సాధిస్తోంది. ఇదే ప్రదర్శనను సఫారీ గడ్డపై కొనసాగిస్తే టీమిండియా సిరీస్‌ను సొంతం చేసుకుంటుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. దక్షిణాఫ్రికాలో బౌన్సి పిచ్‌లకు ఇక్కడి పిచ్‌లకు చాలా తేడా ఉంది. అక్కడికి వెళ్లి ప్రాక్టీస్‌ చేస్తే అప్పుడు ఆ మైదానాలపై కొంత అవగాహన వస్తోంది. ఇటీవల శ్రీలంకతో ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన టెస్టు అనుభవం కొంత కలిసొచ్చే అవకాశం ఉంది" అని సాహా తెలిపాడు. సఫారీలతో టీమిండియా జట్టు మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ-20 లు ఆడనుంది. శ్రీలంకతో టీ20 సిరీస్‌ అనంతరం డిసెంబరు 27న టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది.