సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి భగవతి కన్నుమూత

SMTV Desk 2017-06-16 17:44:56  PN. Bhagwati, Died, Thursday night, Chief Justice of Gujarat High Court

న్యూఢిల్లీ, జూన్‌ 16 : భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రఫుల్లచంద్ర నట్వర్‌లాల్‌ భగవతి (పి.ఎన్‌. భగవతి) (95) గురువారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు దేశంలో న్యాయవ్యవస్థ క్రియాశీలకంగా వ్యవహరించడానికి మార్గదర్శి ఈయనేనని చెబుతారు. అలాగే ప్రజాహిత వ్యాజ్యాల విధానానికి రూపకర్తగా కూడా ఆయన పేరుపొందారు. సుప్రీంకోర్టుకు 17వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన భగవతి.. ఆ పదవిలో 1985 జూలై నుంచి 1986 డిసెంబర్‌ వరకు ఉన్నారు. అంతకుముందు గుజరాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు జడ్జిగా కూడా చేశారు. సర్వోన్నత న్యాయస్థానంలో జడ్జిగా ఉన్న సమయంలోనే ఆయన ప్రజాహిత వ్యాజ్యాలను ప్రవేశపెట్టారు. ప్రాథమిక హక్కుల విషయంలో కోర్టు తలుపు తట్టడానికి ఏ వ్యక్తికీ లోకస్‌ స్టాండీ ఉండాల్సిన అవసరం లేదని కూడా ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పీఎన్‌ భగవతి మృతిపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థను ఆయన అందరికీ అందుబాటులోకి తెచ్చారని శ్లాఘించారు. ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో మినర్వా మిల్స్‌ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనంలో 42వ రాజ్యాంగ సవరణను సమర్థించిన ఒకే ఒక్క న్యాయమూర్తి జస్టిస్‌ భగవతి. ధర్మాసనంలోని మెజారిటీ న్యాయమూర్తులు దీనిని కొట్టివేశారు. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భాష్యంపై కోర్టు ఈ కేసులో స్పష్టత ఇచ్చింది. రాజ్యాంగ సవరణకు పార్లమెంటుకు రాజ్యాంగం పరిమిత అధికారాన్నే ఇచ్చిందని వెల్లడించారు. ఈ పరిమిత అధికారంతో పార్లమెంటు తనకు తాను అపరిమిత అధికారాన్ని సంక్రమింపజేసుకోలేదని తేల్చిచెప్పింది. ఆయన భార్య, వారికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ఆయన అంత్యక్రియలు శనివారం జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు.