ఏకకాలంలో రెండుచోట్ల పోటీ వద్దని సుప్రీంలో పిటిషన్...

SMTV Desk 2017-12-12 14:04:47  elections, two costitutions, compete, petetion, supreem court, aswini kumar upadhyay

న్యూ డిల్లీ, డిసెంబర్ 12: పార్టీ అధినేతలు, ప్రముఖులు ఓటమి భయమో, విశ్వాసం లేకనో ఏకకాలంలో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో రెండు చోట్లా గెలవడం లేక ఒక చోట గెలిచి మరో చోట ఓడిపోవడం చూస్తూ ఉంటాం. రెండు చోట్లా గెలిచినప్పుడు ఎక్కడో ఓ చోట రాజీనామా చేయవలసి ఉంటుంది. దీనితో మళ్లీ ఉప ఎన్నికలు రావడం, ప్రజలు విసుగు చెందడం గమనిస్తుంటాం. దీనిని అడ్డుకోవాలని కోరుతూ బీజేపీ నేత, ప్రముఖ న్యాయవాది అశ్వినీ కుమార్‌ ఉపాధ్యాయ్‌ సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై నాలుగు వారాల్లోగా సమగ్ర స్పందన తెలియజేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)తోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం సోమవారం ఆదేశించింది. ఒకే వ్యక్తి సార్వత్రిక/ఉప ఎన్నికల్లో రెండు వేర్వేరు నియోజకవర్గాల నుంచి ఏకకాలంలో పోటీ చేసేందుకు ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్‌ 33(7) ప్రస్తుతం అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సెక్షన్ తొలగించాలని ఆయన సుప్రీంలో పిటిషన్ వేశారు. దీనిపై ఈసీ, కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.