వ్యవసాయ సంక్షోభంపై మోదీకి లేఖ

SMTV Desk 2017-06-15 11:18:00  Special meetings of Parliament, Agricultural crisis,CPI demands, Party General Secretary Suravaram Sudhakar Reddy, narendra modhi , 35 farmers are strong

న్యూఢిల్లీ, జూన్ 15 : భారత దేశంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభంపై పలు చర్చలు జరిపేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం ఒక లేఖ రాశారు. కొన్ని రాష్ర్టాల్లో పంట దిగుబడి భారీగా ఉండగా, మరికొన్ని రాష్ర్టాల్లో తీవ్రమైన కరువు పరిస్థితుల వల్ల రైతులు కష్టాలు పడుతున్నారని సురవరం వెల్లడించారు. రైతులకు అధిక దిగుబడి కూడా శాపంగానే మారిందని, వారికి గిట్టుబాటు ధర లభించడం లేదని పేర్కొన్నారు. దేశంలో సగటున ప్రతిరోజు 35 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయని గుర్తు చేశారు. నీటి సదుపాయం, నాణ్యమైన విత్తనాలు అందుబాటులో లేకపోవడం, ఖరీదైన ఎరువులు, అసమగ్ర విద్యుత్ సరఫరా తదితర సమస్యలను రైతులు నిత్యం ఎదుర్కొంటున్నారని సురవరం తన లేఖలో తెలిపారు. ఈ అంశాలన్నింటిపై సత్వరమే చర్చలు జరిపేందుకు పార్లమెంట్ ఉభయ సభల సమావేశాలను పది రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు.