మధ్యప్రదేశ్‌ మంత్రిమండలి సంచలన నిర్ణయం..!

SMTV Desk 2017-11-27 11:38:50  madhyapradesh, cabinet, 12 years, death

భోపాల్, నవంబర్ 27 : రోజురోజుకు పెరిగిపోతున్న కామా౦ధుల చర్యలకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. చిన్నారులపై అత్యాచారానికి తెగబడే కామాంధులకు మరణశిక్ష విధించేలా చట్టం తీసుకొచ్చేందుకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం సిద్ధమవుతోంది. 12 ఏళ్లు, అంతకంటే తక్కువ వయసున్న బాలికలపై అత్యాచారం చేసేవారిని ఉరికంబానికి ఎక్కించాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి ఆదివారం ఆమోదించింది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనే ఈ మేరకు బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర ఆర్థికమంత్రి జయంత్‌ మలైయా వెల్లడించారు. మహిళలను దురుద్దేశంతో వెంబడించే వారితోపాటు వేధింపులకు గురిచేసేవారికి కఠిన శిక్షలు వేయాలని కూడా మంత్రిమండలి నిర్ణయించిందని తెలిపారు. సదరు కేసుల్లో దోషులుగా తేలినవారికి రూ.లక్ష జరిమానా కూడా విధించే అవకాశముందన్నారు. 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం చేసే వ్యక్తులకు మరణశిక్ష విధించేందుకు తలపెట్టిన బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందిన తర్వాత కేంద్రానికి పంపిస్తారు. అనంతరం రాష్ట్రపతి ఆమోదం కోసం ఆయనకు చేరవేస్తారు. ఈ చట్టం ఎంతవరకు ఫలిస్తుందో వేచిచూడాలి.