కోల్ కతా, నవంబర్ 24 : టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ఇంగ్లండ్ గడ్డ మీద లార్డ్స్ మైదానంలో ఎవరూ ఊహించనిరీతిలో చొక్కావిప్పి గాల్లోకి ఎగరేస్తూ.. క్రికెట్ మక్కా లార్డ్స్ బాల్కనీలో జరిపిన సంబరం.. ప్రతి క్రికెట్ అభిమాని ఎప్పటికి మరిచిపోలేడు. 2002 జూలై 13న జరిగిన ఈ ఘటన పై, అది అసంకల్పితంగా చేసిన చర్య అని గంగూలీ సైతం వివరణ ఇచ్చారు. తాజాగా ఇండియా టుడే ఈస్ట్ సదస్సులో గంగూలీ భార్య డొనా ఈ ఘటనపై స్పందించారు. గంగూలీ ఆనాడు చేసిన చర్య ఫెంటాస్టిక్ అని కితాబిచ్చారు. గంగూలీ మాట్లాడుతూ.. ‘అలా ఇప్పుడు చేయలేను. ప్రతిసారీ స్పోర్ట్స్ చానెల్‌లో ఆ దృశ్యాన్ని చూపిస్తారు. నేను ఓసారి టీవీ ఎడిటర్‌కు ఫోన్‌చేసి.. నేను 20వేల అంతర్జాతీయ పరుగుల చేశాను. అది చూపించవచ్చు కదా అంటే.. అది చెప్పడానికే ఈ దృశ్యాన్ని వేస్తున్నట్టు చెప్పారు. ఎంతో సంతృప్తితో నేను అలా చేశానని గంగూలీ వ్యాఖ్యానించారు.