ఐసీజే జడ్జిగా తిరిగి ఎంపికైన భండారీ

SMTV Desk 2017-11-22 12:46:50  International Court of Justice Judge Dalveer Bhandari

న్యూఢిల్లీ, నవంబర్ 22 : అంతర్జాతీయ న్యాయస్థానానికి మరోసారి భారత అభ్యర్థి దల్వీర్‌ భండారీ జడ్జిగా ఎన్నికై తిరిగి తన స్థానాన్ని తాను దక్కించుకున్నారు. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సభ్యు ల్లో దాదాపు అందరూ భండారీకే మద్దతు పలకడంతో, సభలో 193ఓట్లకు గాను 183 ఓట్లు దక్కాయి. ఆయన ఎన్నికతో ఐరాస భద్రతా మండలిలోని శాశ్వత సభ్యదేశమైన బ్రిటన్‌ తొలిసారి ఐసీజేలో చోటు కోల్పోవడం జరిగింది. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌, ఆ శాఖ అధికారుల కృషి వల్లే దల్వీర్‌ భండారీ ఐసీజేకి తిరిగి ఎన్నికయ్యారని ప్రధాని మోదీ అన్నారు. భండారీతో పాటు సుష్మాస్వరాజ్‌, విదేశాంగ శాఖ ఉన్నతాధికారులకు అభినందనలు తెలిపారు. అలాగే భారత్‌పై నమ్మకం ఉంచి మద్దతు పలికిన ఐరాస సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. వందేమాతరం.. భారత్‌ ఐసీజేకి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది. జైహింద్‌. ఐసీజేలో జడ్జిగా తిరిగి ఎన్నికైన దల్వీర్‌ భండారీకి అభినందనలు అని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భండారీ ఎన్నిక దౌత్యపరంగా భారత్‌కు దక్కిన ఘన విజయమని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా చెప్పారు. జస్టిస్‌ భండారీకి అభినందనలు తెలిపిన బ్రిటన్‌ ప్రభుత్వం ఐరాసతో పాటు అంతర్జాతీయంగానూ భారత్‌తో కలిసి పనిచేస్తూనే ఉంటామని వెల్లడించింది.