ఢిల్లీ విమానాశ్రయ రద్దీతో ప్రయాణికుల ఆగ్రహం...

SMTV Desk 2017-11-02 18:38:44  Newdelhi Indira Gandhi International Airport, Immigration Counter, Complaints from passengers

న్యూఢిల్లీ, నవంబర్ 02 : ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల రద్దీతో గందరగోళంగా మారుతోంది. బుధవారం ఇమ్మిగ్రేషన్‌ కౌంటర్లను పరిశీలించిన హోంశాఖ అధికారులకు ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 2015లో సగటున రోజుకు 31వేల మంది ప్రయాణిస్తే.. ఇప్పుడు ఆ సంఖ్య 40వేలకు చేరింది. రద్దీకి తగినట్లు సిబ్బంది సంఖ్య లేకపోవడంతో తనిఖీల సమయంలో ప్రయాణికులు క్యూలు కట్టాల్సిన పరిస్థితి నెలకొంటోంది. దీంతో ఇమ్మిగ్రేషన్‌ సిబ్బందిని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యంగా యూరప్‌, గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు అక్కడి విధానాలను ప్రస్తావిస్తూ ఇమ్మిగ్రేషన్‌ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం 160 దేశాల పౌరులకు ఈ-వీసా ఇస్తుండటంతో విదేశీ పర్యాటకులు సంఖ్య గణనీయంగా పెరిగి రద్దీ నెలకొంటోందని హోంశాఖ అధికారులు పేర్కొన్నారు. దీనికి తోడు ఇమ్మిగ్రేషన్‌ కౌంటర్ల వద్ద రద్దీ సమయంలో చాలామంది సిబ్బంది టీ, లంచ్‌, డిన్నర్‌ పేరుతో విధుల్లో ఉండటం లేదని హోంశాఖ అధికారులు వెల్లడించారు. ఢిల్లీ విమానాశ్రయంలో మొత్తం 75 ఇమ్మిగ్రేషన్‌ కౌంటర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కో ప్రయాణికుడిని తనిఖీ చేసేందుకు 50-90 సెకన్ల సమయం పడుతోంది. దాన్ని 30 సెకన్లకు తగ్గించాలని యోచిస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. అయితే దానికి ఇంకొంత సమయం పట్టవచ్చని హోంశాఖ అధికారి ఒకరు తెలిపారు.