ఫ్రెంచ్ ఓపెన్... రోహన్ బోపన్న వశం

SMTV Desk 2017-06-09 12:56:40   French Open, grand slam, Rohan Bopanna, mixed double

పారిస్, జూన్ 09 : టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న అద్భుత విజయం నమోదు చేశారు. ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించి మెుదటి గ్రాండ్ స్లామ్ రికార్డును నమోదు చేశారు. కెనడా క్రీడాకారిణి గాబ్రియేలా దబ్రోవ్ స్కీతో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. దశాబ్దానికి పైగా సర్క్యూట్ లో ఉన్న ఆయనకు ఫ్రెంచ్ ఓపెన్ ద్వారా గ్రాండ్ స్లామ్ కల నెరవేరింది. బోపన్న జంట అనా గ్రోన్ ఫీల్డ్ (జర్మనీ), రాబర్ట్ ఫరా (కొలంబియా) జంటపై 2-6, 6-2, 12-10 తేడాతో విజయం సాధించారు. కెరరీలో తొలి మిక్స్ డ్ డబుల్స్ గ్రాండ్ స్లామ్ లో విజయం నమోదు చేయడంలో రోహన్ బోపన్న అద్భుత ప్రతిభను కనబర్చాడు. మెుదటి సెట్ లో పెలవమైన ప్రదర్శనతో చేజారినప్పటికి ..రెండో సెట్ నుండి కోలుకున్న జంట మూడు సార్లు ప్రత్యర్థి జంట సర్వీసులను బ్రేక్ చేసి విజయం నమోదు చేసింది. విజయాన్ని నిర్ణయించే టై బ్రేకర్ లో ఇరుజోడిలు హోరాహోరీ తలపడ్డాయి. టై బ్రేకర్ లో బోపన్న జంట ఒక దశలో 3-0 ఆధిక్యంతో నిలిచి ఆ తర్వాత వరుసగా ఐదు పాయింట్లు చేజార్చుకుని వెనుక బడిపోయింది. హోరాహోరి పోరాటం మూలంగా ఆధిక్యం రెండు జంటల మధ్య మారుతూ వచ్చింది.రెండు మ్యాచ్ పాయింట్లు సాధించుకున్న బోపన్న జంట పుంజుకుని 11-9 తో టైటిల్ కు దగ్గరగా నిలిచింది. గ్రోన్ ఫీల్డ్ డబుల్ ఫాల్ట్ చేయడంతో బోపన్న జంటకు విజయం సమకూరింది. భారత్ తరపున ఇప్పటివరకు లియాండర్ పేస్, మహేష్ భూపతి, సానియా మీర్జాలు గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించగా తాజాగా బోపన్న గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించిన జాబితాలో చేరాడు..ఇక మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ సాధించడంలో జంటగా భాగస్వామ్యం వహించిన డబ్రోస్కీ గ్రాండ్ స్లామ్ సాధించిన తొలి కెనడా అమ్మాయిగా ఘనత సాధించింది.