రెండు లైన్ లలో దరఖాస్తును పూర్తి చేసిన సెహ్వాగ్

SMTV Desk 2017-06-07 13:12:01  Team India,Coach,Veerendrasehwag, Anilkumble

న్యూఢిల్లీ, జూన్ 7 : భారత క్రికెట్ జట్టుకు కోచ్‌ పదవి అంటే మామూలు విషయం కాదు. ఆ పోస్ట్‌ దక్కితే కాసుల వర్షం కురిసినట్టే. దేశ, విదేశ మాజీ ఆటగాళ్లు ఆ పదవి కోసం అమితాసక్తి ప్రదర్శిస్తారు. అలాంటి పదవి కోసం దరఖాస్తు చేయడమంటే మాటలా!! తమ అనుభవం, జట్టును నడిపించే వ్యూహాలు, అందుకు తమ నైపుణ్యం, ప్రత్యేకతలు గురించి సవివరంగా అందులో పొందుపర్చాల్సి ఉంటుంది. అయితే భారత మాజీ డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ మాత్రం రెండు లైన్లలోనే తన దరఖాస్తును పంపడంతో బీసీసీఐ అధికారులు కంగుతిన్నారట. ఐపీఎల్‌లో కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌కు కోచ్‌, మెంటార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ప్రస్తుత భారత జట్టులోని ఆటగాళ్లందరితో కలిసి గతంలో ఆడాన’ని రెండేవాక్యాలు వీరూ అందులో రాశాడు. దీంతో తాను కోచ్‌ పదవికి ఏవిధంగా అర్హుడన్న విషయాలను తెలియజేసే పూర్తిస్థాయి పత్రాలను జత చేయాలని వీరుకు అడ్మినిస్ర్టేటర్‌ (సీఓఏ) కమిటీ సూచించింది. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీతో ప్రస్తుత కోచ్‌ అనిల్‌ కుంబ్లే పదవీకాలం ముగియనుంది. దీంతో ఈ టోర్నీ తర్వాత సచిన్‌, గంగూలీ, లక్ష్మణ్‌తో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ టీమిండియా కోచ్‌ పదవికి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. కాగా, ఇప్పటికే ఈ పోస్ట్‌ కోసం సెహ్వాగ్‌తో పాటు ప్రస్తుత కోచ్‌ అనిల్‌ కుంబ్లే, టామ్‌ మూడీ, భారత మాజీ క్రికెటర్లు లాల్‌చంద్‌ రాజ్‌పుత, దొడ్డ గణేష్‌, మాజీ పాక్‌, బంగ్లా కోచ్‌ రిచర్డ్‌ పైబ్‌స దరఖాస్తు చేశారు.