భారత్‌- జర్మనీల మధ్య సెమీ హైస్పీడ్‌ రైలు ఒప్పందం

SMTV Desk 2017-10-11 13:15:25  Indian Railways with Germany Agreement, Chennai-Kazipet, Semi-highspeed trains

న్యూఢిల్లీ, అక్టోబరు 11 : జర్మనీతో భారతీయ రైల్వే చెన్నై నుంచి ఖాజీపేటకు 3 గంటల్లో చేరుకునేలా సెమీ హైస్పీడ్‌ రైళ్లను ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ముందడుగు పడింది. ఇందులో భాగంగా చెన్నై నుంచి విజయవాడ మీదుగా ఖాజీపేట కారిడార్‌లో 200 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడిచే విధంగా అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం ఖాజీపేట-చెన్నై మధ్య నడుస్తున్న సర్వీసులకు పది గంటల సమయం పడుతున్న విషయం తెలిసిందే. వీటి స్థానంలో సెమీ హైస్పీడ్‌ రైళ్లు వచ్చిన పక్షంలో ప్రయాణ కాలం సగానికి తగ్గిపోతుందని రైల్వే అధికారుల అభిప్రాయం. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి రైల్వే బోర్డు చైర్మన్‌ అశ్వనీ లోహాని సమక్షంలో భారతీయ రైల్వే, జర్మనీ ప్రభుత్వాలు అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి. అధ్యయనానికి అయ్యే వ్యయాన్ని ఇరువర్గాలు 50:50 నిష్పత్తిలో భరిస్తాయి. చెన్నై- ఖాజీపేట మధ్య నున్న 643 కిలోమీటర్ల కారిడార్‌లో సెమీ హైస్పీడ్‌ రైళ్ల రాకపోకలు సాగించే విధంగా ఇప్పుడున్న మార్గాన్ని అభివృద్ధి చేయడం ఎలా అన్న అంశంపై అధ్యయనం నిర్వహిస్తారు. ఈ అధ్యయనం 3 దశల్లో 22 నెలల్లో పూర్తవుతుందని వెల్లడించారు. త్వరలో ఈ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో ఒప్పందం కుదుర్చుకుని ప్రారంభించనున్నారు.