ముగ్గురి ప్రాణాలను బలిగొన్న సెల్ఫీ సరదా..

SMTV Desk 2017-10-03 16:10:07  SELFEE, BANGALORE BIDADI RAILWAY STATION, STUDENT GROUP PICNIC.

బెంగళూరు, అక్టోబర్ 3 : సెల్ఫీ మీద మోజుతో ఇప్పుడున్న యువత చేస్తున్నదేంటి.? ఒకవైపు మనిషి ప్రాణం పోతున్నా పట్టించుకోకుండా మరోవైపు సెల్ఫీలను దిగుతున్నారు. గతవారం బెంగళూరులోని ఓ కళాశాలకు చెందిన విద్యార్థుల బృందం విహారయాత్ర కోసం వెళ్లి నదిలోకి దిగి సెల్ఫీ తీసుకుంటున్న క్రమంలో.. వారి తోటి విద్యార్థి ఆ నదిలో మునిగిపోతున్న దృశ్యం కంటపడింది. కాని వారు గమనించకపోవడం వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఆ ఘటన జరిగి వారం గడువక ముందే మరో ఘటన వెలుగు చూసింది. వేగంగా ప్రయాణిస్తోన్న రైలుతో సెల్ఫీ తీసుకోవాలనుకున్న ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. బెంగళూరు బిదాబి రైల్వేస్టేషన్‌కు సమీపంలో అతివేగంగా రైలు వస్తుండగా ఆ ముగ్గురు విద్యార్థులు రైలు పట్టాలపై సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ రైలు వారిని ఢీకొట్టడంతో ఎగిరి పట్టాలపై పడ్డారు. వారి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతుల వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.