రోహింగ్యాలు దేశానికి ముప్పు : సుప్రీంకి కేంద్రం నివేదిక

SMTV Desk 2017-09-18 18:58:26  Myanmar, India, Rohingya Muslim, Supreme Court, Affidavit central

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18 : మయన్మార్ నుంచి భారత్ కు అక్రమంగా వలస వచ్చిన రోహింగ్యా ముస్లింలపై సుప్రీంకోర్టుకు కేంద్రం నివేదిక సమర్పించింది. భారత్ లో ఎక్కడైనా నివసించడానికి స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే ప్రాధమిక హక్కు కేవలం భారత పౌరులకు మాత్రమే ఉందని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రం స్పష్టం చేసింది. తమ హక్కుల కోసం అక్రమ వలస దారులు సుప్రీంకోర్టును ఆశ్రయించలేరని తెలిపింది. భారత్ లోకి రోహింగ్యాలు అక్రమంగా వలస రావడం వల్ల దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందని అఫిడవిట్ లో కేంద్రం పేర్కొంది. ఇప్పటివరకు 40 వేలకు పైగా రోహింగ్యాలు అక్రమంగా భారత్ లోకి వలస వచ్చినట్లు తెలిపింది. పాకిస్థాన్ కు చెందిన ఉగ్రసంస్థలతో కొందరు రోహింగ్యాల సంబంధం ఉన్నట్లు నిఘా వర్గాలు సమాచారం అందించాయని కేంద్రం వెల్లడించింది. హవాల మార్గాల్లో నిధుల సేకరణ వంటి చట్ట వ్యతిరేక, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు కొందరు రోహింగ్యాలు పాల్పడుతున్నట్లు తెలిపింది. వీరు ఇతర రోహింగ్యాల కోసం తప్పుడు ధృవ పత్రాలు కూడా సృష్టిస్తున్నట్లు పేర్కొంది. రోహింగ్యా అంశంలో కోర్టు జోక్యం చేసుకోకుండా విధానపరమైన నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం కేంద్రానికి వదిలి వేయాలని సుప్రీంకోర్టును కేంద్రం కోరింది. ఈ కేసులో సుప్రీంకోర్టు అక్టోబర్ 3వ తేదిన తదుపరి వాదనలు విననుంది.