ఈ ఏడాది కరువు పరిస్థితులు లేవు: కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ

SMTV Desk 2017-09-15 15:24:25  Monsoon, Ministry of Agriculture, Department of Agriculture

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15 : దేశంలో ఋతుపవనాల ప్రభావం సాధారణ స్థాయిలో ఉందని, పంటల మనుగడకు వచ్చిన ముప్పు ఏమి లేదని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 17 రాష్ట్రాల పరిధిలోని 225 జిల్లాల్లో కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయంటూ ప్రసార మాధ్యమల్లో తప్పుడు ప్రచారం జరిగిందని మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. రాష్ట్రంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని పేర్కొంది. ప్రస్తుత ఋతుపవనాల సీజన్ లో ఈ నెల 10 వ తేదీ వరకు 738.8 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైందని వెల్లడించింది. సాధారణంగా ఈ సమయానికి 782.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలని, లోటు స్వల్ప స్థాయిలోనే ఉందని కరువు వచ్చే అవకాశాలు తక్కువని వ్యవసాయ శాఖ వివరించింది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు కొనసాగే నైరుతి ఋతుపవనాల వల్ల దేశ వ్యాప్తంగా సాధారణ స్థాయిలో, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ స్థాయిలో వర్షాలు కురిశాయని తెలిపింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఖరీఫ్ పంటల సాగు దాదాపు సాధారణ స్థాయిలోనే ఉందని వివరించింది.