చంపేస్తామంటున్నారు... ఐతే పార్టీ పెట్టి తీరుతా : కమల్

SMTV Desk 2017-09-15 11:29:00  Kamal Hasan, Kamal Political, Tamil

చెన్నై, సెప్టెంబర్ 15: ప్రముఖ విలక్షణ నటుడు కమలహాసన్ రాజకీయాలలో ప్రవేశించనున్నట్లు వార్తలు రావడం, ఆయనను అనేక పార్టీలు ఆహ్వానించడం గురించిన సంచలనాలు రేకెత్తిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కమలహాసన్ ప్రకటనతో ఇలాంటి సంచలనాలకు తెర పడింది. త‌మిళ‌నాడులో ఈ ఏడాది నవంబర్‌లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాల‌ని కమలహాసన్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో కమలహాసన్ ను ఓ మీడియా చానల్ ఇంటర్వ్యూ చేయగా, కమల్ ఈ విధంగా మాట్లాడటం జరిగింది. తనను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని, అయితే ఆ బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదని అన్నారు. తాను ఏ పార్టీలోనూ చేరేది లేదని, కొత్త పార్టీ పెట్టే తీరుతానని స్పష్టం చేశారు. త‌న‌ జీవితంలో చాలా మంది రాజకీయ పార్టీల నేతలను కలుసుకున్నాన‌ని, అయినప్పటికీ తాను ఏ పార్టీ సిద్ధాంతాలకు లోబడలేద‌ని చెప్పారు. తన ఆశయాలకు, ఆలోచనలకు అనువుగా ఏ ఒక్క పార్టీ లేదని తెలిపిన ఆయన దేశంలో మార్పు అవసరమ‌ని ఆ మార్పు త‌న‌తోనే, తమిళనాడు నుంచే రావాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఐదేళ్లకు ఒకసారి ఓటు వేయడం కాకుండా, రాజకీయ నాయ‌కులు ఓట్ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వారిని వెంటనే తొల‌గించగలిగే రాజకీయ వ్యవస్థ మనకు రావాలి, అప్పుడే దేశంలోనూ, రాజకీయాలలోనూ మార్పు రావడం జరుగుతుందని అని ఆయన అన్నారు.