థాయిలాండ్ టైటిల్ సాధించిన సాయిప్రణీత్

SMTV Desk 2017-06-05 15:52:07  saipranith, thailand open grand free badminton tournament, modi

హైదరాబాద్, జూన్ 5 : అద్భత ఫామ్ తో దూసుకెళుతున్న భారత యువ షట్లర్ సాయి ప్రణీత్ కెరీర్ లో మరో అంతర్జతీయ టైటిల్ దక్కించుకున్నాడు. ఈ హైదరాబాదీ స్టార్ ఆటగాడు థాయిలాండ్ ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో సింగిల్స్ చాంపియన్ గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో మూడో సీడ్ సాయి ప్రణీత్ 17-21, 21-18, 21-19 తో ఇండోనేషియాకు చెందిన నాలుగోసీడ్ జొనాథన్ క్రిస్టీన్ పై విజయం సాధించి తొలి గ్రాండ్ ప్రీ గోల్డ్ టైటిల్ అందు కున్నారు. గంటా పదకొండు నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో తొలిగేమ్ కోల్పోయిన ప్రణీత్..తర్వాత పుంజుకొని వరుసగా రెండుసెట్లలో ఆధిపత్యం చాటుకొని విజేతగా నిలిచాడు. ప్రపంచ 24వ ర్యాంకరైన సాయి ప్రణీత్ కిది ఈ ఏడాది వరుసగా రెండో టైటిల్ కావడం విశేషం. ఈ ఏప్రిల్ లో సాయి ప్రణీత్ సింగపూర్ ఓపెన్ లో విజేతగా నిలిచి కెరీర్ లో తొలి సూపర్ సిరీస్ టైటిల్ సాధించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు జనవరిలో భారత్ వేదికగా జరిగిన సయ్యద్ మోడి ఇంటర్నేషనల్ ఓపెన్ లో సాయి ప్రణీత్ రన్నరప్ గా నిలిచారు. ఫైనల్లో సమీర్ వర్మ చేతిలో ఓడాడు. థాయిలాండ్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టైటిల్ సాధించిన సాయి ప్రణీత్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా అభినందించారు. థాయిలాండ్ ఓపెన్ లో విజేతగా నిలిచిన సాయి ప్రణీత్ కు అభినందనలు..సాధించిన ఈ ఘనతను చూసి భారత్ గర్వపడుతున్నది అని మోదీ ట్వీట్ చేశారు.