అది మాత్రం జీవితంలో చేయలేను!

SMTV Desk 2019-12-19 13:50:28  

హిందీలో డ్యాన్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘స్ట్రీట్ డ్యాన్సర్ 3’. ‘ఏబీసీడీ’ సిరీస్ నుంచి వస్తు్న్న మూడో సినిమా ఇది. వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్ జంటగా నటించారు. ప్రభుదేవా కీలక పాత్రను పోషించారు. రెమో డిసౌజా డైరెక్ట్ చేశారు. తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కాగా.. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను విజయ్ దేవరకొండ ట్విటర్‌లో విడుదల చేశారు. ‘జీవితంలో ఇది నేను చేయలేను. సినిమాలో చూసి ఎంజాయ్ చేయడమే’ అని క్యాప్షన్ ఇచ్చారు. విజయ్ నిర్మాతగా వ్యవహరించిన సినిమా ‘మీకు మాత్రమే చెప్తా’. ఇందులో విజయ్ ఓ సాంగ్‌లోనూ మెరిశాడు. అయితే ఈ పాటలో డ్యాన్స్ చేయడానికి విజయ్ చాలా కష్టపడ్డాడు. ఇంతటి కష్టమైన స్టెప్పులు తన వల్ల కావని, తారక్ అల్లు అర్జున్ అయితే ఇరగదీసుండేవారని చెప్పాడు. తాను మాత్రం ఈ వీడియోలో డ్యాన్స్ చేయడానికి చాలా కష్టపడ్డానని తెలిపాడు. దీనిని బట్టి చూస్తే విజయ్‌కి డ్యాన్స్ అంటే ఎంత భయమో తెలుస్తోంది. విజయ్ దేవరకొండకు బాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. అక్కడి హీరోలకు ఉండే ఫాలోయింగ్ విజయ్‌కి కూడా ఉంది. ఇందుకు కారణం విజయ్‌కి ఉన్న స్టైలే. ఇక విజయ్ నటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాను ‘కబీర్ సింగ్’ టైటిల్‌తో రిలీజ్ చేయడంతో ఆ క్రేజ్ మరింత పెరిగిపోయింది. విజయ్ ముంబయిలో అడుగుపెట్టగానే అక్కడి ఫొటోగ్రాఫర్లు భాయ్ అంటూ స్వాగతిస్తుంటారు. అతని ఫొటోలు తీసేందుకు ఎగబడుతుంటారు. అందుకే ‘స్ట్రీట్ డ్యాన్సర్3 ’ తెలుగు ట్రైలర్‌ను విజయ్ చేత రిలీజ్ చేయించి ప్రమోట్ చేస్తున్నారు.