గనమ్యాన్ నిర్వాకానికి పాడైపోయిన యంత్రం

SMTV Desk 2017-06-04 11:16:24  

హైదరాబాద్ జూన్ 4: ఎమ్మారై స్కానింగ్‌ చేయించుకోవడానికి వెళ్తే ఒంటి మీద ఉన్న లోహపు వస్తువులన్నిటినీ తీసి వెళ్లాలని ఎందుకు చెప్తారో.. యూపీలోని ఓ మంత్రిగారి గన మ్యానకు ఆలస్యంగా తెలిసింది. అతగాడి నిర్వాకానికి ఆస్పత్రిలో ఎమ్మారై యంత్రం పాడైపోయింది. ఆ యంత్రాన్ని బాగు చేయించడానికి 50 లక్షలు ఖర్చుకానుంది. అంతే కాకుండా .. యంత్రం మరమ్మతుకు మరో పదిరోజులు సమయం పడుతుంది!! అసలు విషయానికి వస్తే .. యూపీ మంత్రి సత్యదేవ్‌ పచౌరీ శుక్రవారంనాడు హర్దోయ్‌లో ఒక బహిరంగ సభకు వెళ్లి అస్వస్థతకు గురవ్వడం జరిగింది. దాంతో వెంటనే ఆయన్ను లఖ్‌నవ్‌లోని రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు ఎమ్మారై స్కానింగ్‌ చేయాలన్నారు. ఆ మంత్రితోపాటు ఉన్న గన మ్యాన కూడా లోనికి వెళ్లాడు. ఎమ్మారై రూమ్‌లోకి వెళ్లే ముందు లోహపు వస్తువులన్నీ బయటే పెట్టాలన్న నిబంధనను మరచి సర్వీస్‌ తుపాకీతో సహా లోపలికి అడుగుపెట్టాడు. మరుక్షణమే ఎమ్మారై యంత్రం అయస్కాంత శక్తి కారణంగా.. తూటాలున్న సర్వీస్‌ రివాల్వర్‌ అమాంతం హోల్‌స్టర్‌లోంచి వెళ్లి ఆ యంత్రానికి అతుక్కుపోయింది. దాంతో యంత్రం పాడైపోయింది. ఆ మెషీనను ప్రస్తుతం బాగు చేస్తున్నట్లు.. అది పనిచేయడానికి మరో 10 రోజులు పడుతుందని ఆస్పత్రి డైరెక్టర్‌ వెల్లడించారు.