టీజర్ సెలబ్రేషన్స్‌...81 అడుగుల భారీ కటౌట్

SMTV Desk 2019-11-26 12:02:58  

మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తాజాగా విడుదలైన టీజర్ వ్యూసే చెబుతున్నాయి. శుక్రవారం విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ కేవలం 40 గంటల్లో 20 మిలియన్‌ల రియల్ టైమ్ వ్యూస్ సాధించింది. టాలీవుడ్ చరిత్రలో ఇదో రికార్డ్. సాధారణంగా సినిమా విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద హీరోల కటౌట్లు పెడుతుంటారు. కానీ, సంక్రాంతికి విడుదలయ్యే సినిమా కోసం ఇప్పుడే కటౌట్ పెట్టేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ వద్ద 81 అడుగుల భారీ మహేష్ బాబు కటౌట్‌ను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఈ కటౌట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సుదర్శన్ థియేటర్‌లో ఏర్పాటుచేసిన 81 అడుగుల భారీ కటౌట్‌ టీజర్ సెలబ్రేషన్స్‌లో భాగమట. సినిమా విడుదల వరకు ఈ కటౌట్‌ను అలానే ఉంచుతారని సమాచారం. సినిమా విడుదల రోజు ఇదే కటౌట్‌ను ముస్తాబు చేస్తారట. అసలు ఈ కటౌట్‌తోనే ‘సరిలేరు నీకెవ్వరు’ సెలబ్రేషన్స్ షురూ చేశారట. సెలబ్రేషన్స్ విషయం ఏమో కానీ.. ఇప్పుడైతే మాత్రం మహేష్ అభిమానులు ఈ కటౌట్‌ను చూసి మురిసిపోతున్నారు. సంబరపడిపోతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఒక మంచి ట్రీట్ అవుతుందని నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర ట్వీట్ చేశారు. ‘‘భారీ ఎత్తున చేస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ సెలబ్రేషన్స్ ప్రారంభం మాత్రమే. ఇప్పుడు భూమి బద్దలైపోయే వేడుకలకు సమయం వచ్చింది. మన నిజాం కోట నుంచి ఈ వేడుకలు మొదలవుతాయి. సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ వద్ద ఏర్పాటుచేసిన భారీ 81 అడుగుల కటౌట్ ఇదిగో. ‘సరిలేరు నీకెవ్వరు’ సూపర్ ఫ్యాన్స్‌కి ఒక ట్రీట్ కాబోతోంది’’ అని అనిల్ పేర్కొన్నారు. ‘పటాస్’తో దర్శకుడిగా పరిచయమైన రచయిత అనిల్ రావిపూడి తొలి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తరవాత ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’ సినిమాలతో కమర్షియల్ డైరెక్టర్ అనిపించుకున్నారు. ఇక ‘F2’ నిర్మాతకు కాసుల వర్షం కురిపించారు. ఇప్పుడు మహేష్ బాబుతో బాక్సాఫీసు రికార్డులు బద్దలుకొట్టడానికి సిద్ధమైపోతున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని టీజర్ చూస్తే అర్థమైంది. మరి ఆ నమ్మకాన్ని సినిమాలో నిలబెడతారో లేదో చూడాలి.