అందుకే పవన్ తో సినిమా తీస్తున్నా!

SMTV Desk 2019-11-04 17:14:27  

ఎట్టకేలకు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఓ సెన్సేషనల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత పవన్ పూర్తిగా సినిమాలకు దూరం అయిపోతారు అనుకున్నారంతా. కానీ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ పవన్‌ చేత సినిమాను మొదలుపెట్టించబోతున్నారు. అయితే ఈ సినిమాను పవన్‌తోనే ఎందుకు చేయాలనుకుంటున్నారో తాజాగా బోనీ కపూర్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన సినిమా ‘పింక్’. ఇది చాలా మంది విజయం అందుకుంది. తమిళ నటుడు అజిత్‌తో కలిసి ఏదన్నా సినిమా చేయాలన్నది నా భార్య శ్రీదేవి కల. ఆ కల నెరవేర్చడం కోసం నేను పింక్‌ను తమిళంలో ‘నేర్కొండ పార్వాయ్’ టైటిల్‌తో రీమేక్ చేశాను. ఈ వెర్షన్ కూడా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఆ తర్వాత తెలుగులో తీసినా అంతే విజయం సాధిస్తుందన్న నమ్మకం ఏర్పడింది. అందుకే ఈ సినిమాను తెలుగులో తీయాలని నిర్ణయించుకున్నాను. తెలుగు ప్రేక్షకులను నచ్చే అంశాలతోనే సినిమాను తీస్తాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకే ఆయన్ను ఒప్పించాను’ అని వెల్లడించారు. ఇంతకీ ఈ పింక్ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే.. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు, ఓ లాయర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. ఆ ముగ్గురు అబ్బాయిల్లో ఒకరు ఓ అమ్మాయిపై అత్యాచారం చేయాలని చూస్తాడు. ఆమె తప్పించుకునే క్రమంలో బీర్ బాటిల్‌తో అతని తల పగలగొడుతుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఈ కేసును మొదటి నుంచి డీల్ చేస్తున్న లాయర్ (అమితాబ్ బచ్చన్) ఎలా నెగ్గారు అన్నదే కథ. ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న కథలను ఎన్నిసార్లు రీమేక్ చేసినా మంచి ఫలితాలు వస్తాయి. కాకపోతే కథనం నేటివిటీకి తగ్గట్టుగా ఉండేలా జాగ్రత్త పడాలి. లక్షలాది మంది అభిమానులకు పవన్ ఆదర్శం కాబట్టి.. ఇలాంటి సినిమాలో పవన్‌ను లాయర్‌గా చూడబోతున్న ఫ్యాన్స్‌కు పింక్ రీమేక్‌లో ఓ కానుకనే చెప్పాలి. ఈ సినిమాను వేణు శ్రీరామ్ తెరకెక్కించనున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తారు.