పెళ్లిచేసుకోవాలంటూ నడీరోడ్డుపై నవవధువుకు వేధింపులు!

SMTV Desk 2019-10-01 15:10:11  

తనని కాకుంటా మరొకరిని పెళ్లి చేసుకుందన్న కోపంతో ఓ యువకుడు నవవధువుని నడీ రోడ్డుపై వేధింపులకు పాల్పడ్డాడు. గురుగ్రామ్‌కు చెందిన ఓ యువతి(25)కి తాజాగా పెళ్లైంది. అయితే ఆదివారం ఒంటరిగా ఎస్‌సీఓ మార్కెట్‌కు వెళ్ళిన తనదగ్గరికి ఓ యువకుడు వచ్చి తనను పెళ్లి చేసుకోవాలని, లేకపోతే చంపేస్తానని వేధించాడు. తనకు పెళ్లయిందని, నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటానని తిట్టిపోసి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించింది. వెంటపడుతూ వెళ్లిన ఆ యువకుడు ఆమెపై నడిరోడ్డుపైనే అసభ్యంగా ప్రవర్తించాడు. పెళ్లి చేసుకోకపోతే రోడ్డుపైనే పరువు తీస్తానంటూ బెదిరించాడు. తనను వదిలేయాలని వేడుకుంటున్నా కనికరించకుండా ఆ యువకుడు ఆమెపై తీవ్రంగా వేధించాడు. దీంతో కొందరు స్థానికులు, వ్యాపారులు ఆ దుండగుడిని చితక్కొటి బంధించారు. ఈలోగా ఆ యువతి ఆటోలో ఇంటికి వెళ్లి భర్తకు విషయం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని వినీత్ కటారియాగా గుర్తించారు. బాధితురాలితో అతడికి పెళ్లికి ముందే పరిచయం ఉందని, తనతో స్నేహం చేయాలని, పెళ్లి చేసుకోవాలని వినీత్ ఆమెను తరుచూ విసిగించేవాడని తెలిపారు. అతడి ప్రతిపాదనను తిరస్కరించిన యువతి వేరే పెళ్లి చేసుకోవడంతోనే వినీత్ ఉన్మాదిగా మారి ఆమెపై కక్ష గట్టాడని వెల్లడించారు. పోలీసులు వినీత్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.