ఈ నిర్ణయం కశ్మీర్‌లో రక్తపాతానికి దారితీస్తుంది

SMTV Desk 2019-08-06 11:48:06  

కశ్మీర్ సమస్య పరిష్కారం విషయంలో భారత ప్రభుత్వం తమ హామీని నిలబెట్టుకోలేకపోయిందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నిర్ణయం కశ్మీర్‌లో రక్తపాతానికి దారితీస్తుందని అన్నారు.

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 375,35ఏ ఆర్టికల్ రద్దుపై ఆయన స్పందిస్తూ.. ‘ఈ నిర్ణయం కశ్మీర్‌లో రక్తపాతానికి దారితీస్తుంది. భారత్ చాలా ప్రమాదకర ఆటను ఆడుతోంది. ఈ విషయాన్ని తాము ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ దృష్టికి తీసుకెళ్తాం. కశ్మీర్ ఓ అంతర్జాతీయ వివాదం.. ఇందులో మేము కూడా భాగస్వాములుగా ఉన్నాం. దీనిపై వారు ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారు. పాకిస్తాన్ మీడియా కూడా ఈ నిర్ణయాన్ని అక్రమం, అప్రజాస్వామికం అని విమర్శించింది. ఈ తరుణంలో ప్రపంచమంతా కశ్మీరీలకు అండగా నిలబడి ప్రజాస్వామ్యం పట్ల ఉన్న నిబద్దతను చాటుకోవాలి. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా.. ఆ దేశ సోకాల్డ్ ప్రజాస్వామ్య ముసుగు ప్రపంచం ముందు బహిర్గతం చేసింది. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాశ్మీర్ నాయకత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించదు’ అని అన్నారు.

ఇదిలావుండగా భారత దుస్సాహసం నుంచి తమను తాము కాపాడుకోడానికి సిద్ధంగా ఉన్నామని, కశ్మీర్‌ ప్రజలకు దౌత్య, నైతిక, రాజకీయ మద్దతు కొనసాగిస్తామని పాక్‌ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. భారత చర్యల వల్ల ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతికి భంగం కలుగుతోందని పేర్కొంది.