ఆ టెన్షన్ కి కోచ్ మృతి!

SMTV Desk 2019-07-18 15:43:29  jimmy neesham childhood coach died

ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా సాగిందో తెలిసిందే. చివరికి ఇంగ్లాండ్ కప్ ను ఎగరేసుకుపోయింది. అయితే ఈ నరాలుతెగే ఉత్కంఠను తట్టుకోలేక న్యూజిలాండ్ ఆల్ రౌండర్ జేమ్స్ నీషమ్ చిన్ననాటి కోచ్ డేవిడ్ జేమ్స్ గోర్డాన్ కన్నుమూశాడు. ఈ విషయాన్ని జేమ్స్ గోర్డాన్ కుమార్తె లియోనీ స్వయంగా వెల్లడించింది. ఓ న్యూజిలాండ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఆమె మాట్లాడుతూ "సూపర్ ఓవర్‌ జరుగుతున్న సమయంలో నర్స్ నా వద్దకు వచ్చి మీ త్రండిగారి శ్వాసలో మార్పు వచ్చింది" అని తెలిపిందని అన్నారు. "నాకు తెలిసి సూపర్ ఓవర్‌లో జేమ్స్ నీషమ్ రెండో బంతికి బాదిన సిక్స్‌తో ఆయన తుది శ్వాసను తీసుకున్నాడని భావిస్తున్నా" అని ఆమె చెప్పారు. అక్లాండ్ గ్రామర్ స్కూల్ మాజీ టీచర్ అయిన డేవిడ్ జేమ్స్ గోర్డాన్ జేమ్స్ నీషమ్‌కు చిన్నతనంలో కోచ్‌గా వ్యవహారించారు. తన చిన్ననాటి కోచ్ కన్నుమూశాడన్న వార్త తెలిసిన జేమ్స్ నీషమ్ ట్విట్టర్‌లో స్పందించాడు. "డేవ్ గోర్డాన్ నా హైస్కూల్ టీచర్ మాత్రమే కాదు. కోచ్, స్నేహితుడు కూడా. ఆట పట్ల మీకున్న ప్రేమ అద్భుతం" అని అన్నాడు. "మీ కోచింగ్‌లో ఆడటం నా అదృష్టం. మ్యాచ్ తర్వాత మీరు అభినందించిన తీరు ఇప్పటికీ గుర్తు. నన్ను చూసి మీరు గర్వించారని భావిస్తున్నా. ప్రతిదానికి ధన్యవాదాలు. RIP" అంటూ జేమ్స్ నీషమ్ ట్వీట్ చేశాడు. నీషమ్‌ను తన తండ్రి ఎంతగానో అభిమానించేవారని లియోనీ పేర్కొన్నారు. ఆక్లాండ్‌ గ్రామర్‌ స్కూల్‌లో 25 ఏళ్లుపైగా టీచర్‌గా పనిచేసిన డేవిడ్‌ జేమ్స్‌ గొర్డాన్‌ ఎంతో మంది విద్యార్థులకు క్రికెట్‌, హాకీ నేర్పించారు. నీషమ్‌, ఫెర్గూసన్‌లతో పాటు చాలా మంది హైస్కూల్‌ విద్యార్థులకు కోచింగ్‌ ఇచ్చారు.