సర్ఫరాజ్ అహ్మద్‌కు ఒంట్లో కొవ్వు బాగా పెరిగింది

SMTV Desk 2019-06-02 13:10:46  Akthar , Surfaraz,

తమ కెప్టెన్‌కు కొవ్వు బాగా పెరిగిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు పాక్ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌. శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ చిత్తుచిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. విండీస్‌ బౌలర్లు వరుసగా షార్ట్‌పిచ్‌ బంతులతో చెలరేగడంతో పాక్‌ 105 పరుగులకే చేతులెత్తేసి ఘోర పరాజయం పాలైంది. దీంతో ఆ దేశ అభిమానులు, మాజీ క్రికెటర్లు పాక్ ఓటమిని తీవ్రంగా ఖండిస్తున్నారు. పాక్‌ జట్టుపై ట్రోలింగ్‌ మొదలుపెట్టారు.

తాజాగా షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. క్రికెటర్ అయి వుండి సాటి క్రికెటర్లను దునమాడిన తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘మా కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు ఒంట్లో కొవ్వు బాగా పెరిగిపోయింది. అతను టాస్‌కి వస్తున్నప్పుడు కొవ్వు పేరుకుపోయిన అతని పొట్ట బయటకు వచ్చి అసహ్యంగా కనిపించింది. నేను చూసిన మొదటి అన్‌ఫిట్‌ కెప్టెన్ అతనే. అతను తనకున్న కొవ్వుతో కనీసం కదల్లేకపోతున్నాడు. వికెట్ కీపింగ్ సమయంలోనూ ఇబ్బంది పడ్డాడు’ అని అక్తర్ కామెంట్ చేశారని పాక్‌ జర్నలిస్ట్‌ సాజ్‌ సాదిక్‌ పేర్కొన్నారు. అవి ఎంతవరకు నిజమన్నది తెలియాల్సి వుంది.

ఇదిలా వుండగా షోయబ్ ఓ ట్వీట్‌లో మాటల్లేవ్‌ అంటూ కామెంట్‌ చేశాడు. ‘అయ్యిందేదో అయిపోయింది.. నా ఆలోచనలు భావోద్వేగాలను మరోసారి పునరాలోచించుకుంటున్నాను. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాళ్లకు మనమంతా అండగా నిలవాలి. టోర్నీకి మన మద్దతు అవసరం. మ్యాచ్ ఓడిపోయిందని, మనం బాధపడి వారిని మన కామెంట్లతో బాధపెట్టడం సరికాదు. వారికి మద్దతుగా నిలుద్దాం’ అని ట్వీట్ చేశాడు.

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2017లో కూడా భారత్‌ చేతిలో తొలుత ఓడామని కానీ ఫైనల్లో గెలిచి టైటిల్‌ సాధించామని పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఓటమిపై వివరణ ఇచ్చాడు. ఈ దారుణ ఓటమి నుంచి తమ ఆటగాళ్లు త్వరగా కోలుకుంటారని, టైటిల్‌ పోరులో నిలుస్తారనే నమ్మకం తనకు ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇంకా 8 మ్యాచ్‌లున్నాయని, రాణిస్తామని అన్నాడు.