ఇద్దరు పిల్లలను చంపి చెక్కపెట్టెలో పడేసిన దుండగులు!

SMTV Desk 2019-06-02 13:07:18  police

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వారం రోజుల క్రితం కనిపించకుండాపోయిన ఇద్దరు పదో తరగతి విద్యార్థులు పాఠశాల గదిలో శవాలుగా తేలారు. ఈ ఘటన జిల్లాలో చెన్నయ్యపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. చెన్నయ్యపాలెంకు చెందిన కార్తీక్, ప్రశాంత్ వారం రోజుల క్రితం కనిపించకుండాపోయారు. దీంతో వారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదుచేసిన అధికారులు పిల్లల కోసం గాలింపు చేపట్టారు.

అయితే ఎంత వెతికినా పిల్లలజాడ తెలియరాలేదు. ఈ నేపథ్యంలో ఊరిచెరువు దగ్గరున్న పాఠశాలలో ఈరోజు దుర్గంధం రావడం ప్రారంభమైంది. దీంతో రైతులు పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీస్ అధికారులు స్కూల్ లోని ఓ చెక్క పెట్టెను తెరిచిచూడగా, ఇద్దరు పిల్లల మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో లభ్యమయ్యాయి. ఎవరో ఇద్దరు పిల్లలను చంపేసి చెక్కపెట్టెలో పడేసినట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.