జై శ్రీ రామ్ నినాదాలతో రచ్చ రచ్చ

SMTV Desk 2019-06-01 12:10:04  mamata,

లోక్‌సభ ఎన్నికలు ముగిసి వారం రోజులు దాటుతున్నా మమత ఇలాఖాలో ఇంకా రాజకీయ వేడి తగ్గలేదు. అధికార తృణమూల్ కాంగ్రెస్ ఇంకా ఓటమి షాక్ నుంచి బయటపడకముందే బీజేపీ నీడలా వెంటాడుతుండడంతో ఇరు పార్టీల మధ్య వైరం మరింత ముదురుతోంది. ఎన్నికల సందర్భంగా ‘‘జై శ్రీరాం’’ నినాదాలతో సీఎం మమతా బెనర్జీని చికాకుపెట్టిన బీజేపీ కార్యకర్తలు మరోసారి ఆమెను టార్గెట్ చేశారు. ఇటీవల ఎన్నికల ప్రచారం నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలు నేడు ధర్నాకు తలపెట్టాయి. ఈ ధర్నాలో పాల్గొనేందుకు మమత వెళుతుండగా మార్గమధ్యంలో బీజేపీకి చెందిన వారిగా భావిస్తున్న కార్యకర్తలు ఆమె కాన్వాయ్‌ని అడ్డగించారు. మరోసారి ఇలాంటి చేష్టలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మమత హెచ్చరించినా కూడా కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు. వెంటనే వారిని అదుపులోకి తీసుకోవాలని మమత పోలీసులను ఆదేశించారు.